బియ్యం బకాసురులు! | - | Sakshi
Sakshi News home page

బియ్యం బకాసురులు!

Jun 1 2026 7:23 AM | Updated on Jun 1 2026 7:23 AM

రేషన్‌ దుకాణాలకు రాకముందే పక్కదారి

నిబంధనలను అడ్డుపెట్టుకుని తరలిస్తున్న డీలర్లు వృద్ధులకూ బియ్యం అందకుండా చేస్తున్న వైనం ఆదాయ వనరుగా మార్చుకున్న అధికార పార్టీ నాయకులు నామ మాత్రపు దాడులతో సరిపెడుతున్న అధికారులు

పంపిణీకి ముందే..

రెండు రోజులుగా దాడులు..

రేషన్‌ దుకాణాలకు రాకముందే పక్కదారి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి రేషన్‌ దుకాణాలకు రాకుండానే దారి మళ్లుతోంది. గతంలో బియ్యాన్ని పాలిథీన్‌ సంచుల్లోకి మార్చి తరలించేవారు. ఇపుడు ఏకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ముద్రలతో ఉన్న గన్నీ బ్యాగులను యథాతథంగా ఉంచి పక్కదారి పట్టిస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకటో తేదీ లోపే కొన్ని రేషన్‌ దుకాణాల్లో బియ్యం మాయమవుతోంది. ప్రభుత్వం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎన్ని నిబంధనలు విధించినా అక్రమార్కులు శత ‘కోటి’ ఉపాయాలు ఆలోచించి చాక చక్యంగా దారి మళ్లిస్తున్నారు. ఈ తంతు అధికారులకు తెలిసినప్పటికీ నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు.

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో మొత్తం 957 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 5,96,378 మంది కార్డుదారులు ఉన్నారు. నెల నెలా 8,339 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. ఇందులో 80శాతం వరకు దారిమళ్లుతోంది. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. బియ్యం మాఫియాకు కాసులు కురిపిస్తోంది. రేషన్‌ డీలర్లు కొందరు రింగ్‌గా ఏర్పడి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. డీలర్ల నుంచి సేకరించి బడా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను ఆదాయ వనరుగా మార్చుకున్నారు.

మామూళ్ల మత్తులో..

బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం తెలిసినప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. బియ్యం వ్యాపారులు నెలనెలా అధికారులకు మామూళ్లు పంపుతున్నామంటూ బాహాటంగానే చెబుతున్నారు. ఒక్కో రేషన్‌ షాపు నుంచి ఇంత మొత్తం అని రేటు నిర్ణయించి అధికారులకు మామూళ్లు ముట్టజెబుతున్నారు. ఒకరిద్దరు డీలర్లు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తే వారిని నాయకుల ద్వారా, అధికారుల ద్వారా భయపెట్టి దారికి తెచ్చుకుంటున్నారు. కేసులు బనాయిస్తామని, రేషన్‌ షాపు రద్దు చేస్తామని వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. విజయవాడ నగరంలో ఒక్కో రేషన్‌ షాపు నుంచి అధికారులకు రూ.1750 నుంచి రూ. 2వేల వరకు రేషన్‌ డీలర్లే వసూలు చేసి అధికారులకు ముట్టజెపుతున్నట్లు సమాచారం.

ఆ డీలర్‌ కనుసన్నల్లోనే మాఫియా..

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని ఓ రేషన్‌ డీలర్‌ కనుసన్నల్లోనే రేషన్‌ అక్రమ రవాణా జరుగుతోంది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో డీలర్లంతా ఇతనికే బియ్యం విక్రయించాలని అధికారులతో ఒత్తిడి చేయిస్తున్నారు. కూటమి నేతల అండదండలతోనే బియ్యం అక్రమ రవాణా సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం పౌర సరఫరా శాఖలో ప్రతి అధికారికి తెలిసినప్పటికీ అతని వైపు కన్నెత్తి చూడడం లేదు.

ప్రతినెలా 20వ తేదీ నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ల ద్వారా రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరా అవుతోంది. ఒకటే తేదీ నుంచి కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి రేషన్‌ దుకాణానికి చేరిన బియ్యం పంపిణీకి ముందే అక్రమ రవాణా జరుగుతోంది. వయో వృద్ధులకు ఒకటో తేదీ కంటే ముందు నుంచే బియ్యం సరఫరా చేయాలన్న నిబంధన ఉంది. దీన్ని అడ్డుపెట్టుకుని ఒకటో తేదీన బియ్యం పంపిణీ ప్రారంభానికి ముందే అక్రమంగా తరలిస్తున్నారు. వయో వృద్ధులతో పాటు ఇతర కార్డుదారులకు పంపిణీ చేయాల్సిన మొత్తం అక్రమంగా తరలిపోతోంది. అధికారులు తనిఖీ చేస్తే వృద్ధులకు పంపిణీ చేశామని చెబుతున్నారు.

రెండు రోజుల క్రితం జిల్లా జేసీ రేషన్‌ డీలర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. రేషన్‌ బియ్యం అక్రమంగా తరలించే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్‌ ఓపెన్‌ చేస్తామని హెచ్చరించారు. జేసీ ఆదేశాల నేపథ్యంలో రెండు రోజులుగా విజయవాడ నగరంతో పాటు జిల్లాలోనూ రేషన్‌ షాపులపై దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయాల్సిన బియ్యం ఇప్పటికే దుకాణాల నుంచి తరలివెళ్లినట్లు తెలిసింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రేషన్‌ షాపులు తనిఖీ చేయగా స్టాక్‌ వ్యత్యాసాలు బయటపడ్డాయి. 4 షాపులను అధికారులు తనిఖీ చేయగా ఇందులో రెండు షాపుల్లో సరుకు తరలిపోయినట్లు గుర్తించారని సమాచారం. ఆయా షాపులు నిర్వహిస్తున్నట్లు డీలర్లు తాము అందుబాటులో లేమంటూ చెప్పడంతో షాపులకు తాళాలు వేసినట్లు తెలిసింది. పశ్చిమంలో బినామీ పేరుతో నడుస్తున్న షాపునకు అధికారులు తాళం వేశారు. ఇక్కడ మాఫియాగా మారిన రేషన్‌ డీలర్‌ కింది స్థాయి అధికారుల ద్వారా సర్దుబాటు చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement