నో టుబాకో డే ర్యాలీలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఊపిరితిత్తులు, క్యాన్సర్ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేసి, పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈగల్ టీమ్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పొగాకు వినియోగంతో మన శరీరంలోని ప్రధాన అవయవాలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు.
యువతే లక్ష్యం..
యువతను లక్ష్యంగా చేసుకుని పొగాకు పరిశ్రమలు అనుసరిస్తున్న ప్రచార వ్యూహాలను గుర్తించి వాటిని ఎదుర్కొనేందుకు సమాజంలోని అన్ని వర్గాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ అన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం ద్వారా విద్యాసంస్థల పరిసరాల్లోని అక్రమ పొగాకు విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. నేషనల్ టుబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ రాష్ట్ర అధికారులు డాక్టర్ గీతాపద్మజ, డాక్టర్ సౌజన్యలక్ష్మిలతో పాటు రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి. సమరం, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డాక్టర్ జె. ఇందుమతీదేవి పాల్గొన్నారు.


