పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.91.95 లక్షలకు పైగా నగదును కానుకలు, మొక్కు బడిగా సమర్పించారు. వీటిని శనివారం అమ్మవారి మండపంలో లెక్కించారు. 60 రోజులకు ఆలయంలో మొత్తం హుండీల్లోని కానుకలు లెక్కించగా నగదు రూపంలో రూ.91,95,850, మిశ్రమ బంగారం 25 గ్రాములు, వెండి 380 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. యూఎస్‌ఏ డాలర్లు 123, లండన్ పౌండ్స్ 30, బ్రెజిల్ 20 డాలర్లు, సెంట్రల్ బ్యాంక్ 6 లిబియా దినార్స్ వచ్చాయన్నారు. కానుకలను ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవా సమితి సభ్యులు, గ్రామానికి చెందిన భక్తులు లెక్కించారు. కానుకల లెక్కింపును ఈఓ, ఉత్సవ కమిటీ మాజీ సభ్యులు చుంచు రమేష్‌బాబు, గ్రూప్ టెంపుల్స్ ఈఓలు సీహెచ్ జయప్రకాష్, బీవీ సుబ్బారావు పర్యవేక్షించారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ (మెన్ అండ్ ఉమెన్) చాంపియన్‌షిప్‌లో తమ యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఒంగోలు శారద కాలేజ్ ఆఫ్ ఫిజియో థెరపీకీ చెందిన విద్యార్థి ఎం.రమేష్‌ను ఎంపిక చేశామని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌స్ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ త్రిమూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 120 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగం పోటీల్లో రమేష్ పాల్గొంటారని పేర్కొన్నారు. పోటీలు చైన్నెలో వచ్చే నెల 3 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ టి.సాయిసుఽధీర్, అధ్యాపకులు.. రమేష్‌ను శనివారం యూనివర్సిటీ ఆవరణలో అభినందించారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడలతో ఆరోగ్యం, ఐక్యతాభావం పెంపొందుతాయని ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్థి అధికారి (డీఎస్‌డీవో) కె.కోటేశ్వరరావు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడా విభాగం ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుంచి జిల్లాలో పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో శిక్షణ పొందిన వారు క్యాంపులు ముగిసిన తర్వాత కూడా ఆయా క్రీడల్లో శిక్షణను కొనసాగించాలని సూచించారు. ఏపీ క్రీడా ప్రాథికార సంస్థ(శాప్) డైరెక్టర్ సంతోష్, యూత్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఎన్టీఆర్ జిల్లా అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రతినిధులు దుర్గారావు, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్ మోసాలపై సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించడమే ఎన్టీఆర్ పోలీస్ ఖాకీ స్టూడియో లక్ష్యమని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, జరగక ముందే ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్‌కు ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శనివారం ముగిసింది. సీపీ మాట్లాడుతూ శిక్షణ పొందిన సిబ్బంది సైబర్ నేరాలు, వివిధ ఆన్‌లైన్ మోసాలు, ఓఎల్‌ఎక్స్ యాప్ ద్వారా జరిగే మోసాలు వంటి వాటిపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. తక్కువ మాటలతో ఎక్కువ సందేశాన్ని ఇచ్చేలా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ సరిత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


