విద్యుత్‌షాక్ మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలి అప్రకటిత విద్యుత్ కోతలు ఆపాలి ఈట్ స్ట్రీట్‌లో ప్రైవేటు దందాను అరికట్టాలి ఎస్‌ఈకి వినతిపత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ నాయకులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వంలో అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నామని ఫోన్లు చేస్తే అధికారులు స్పందించడం లేదన్నారు. ఆ శాఖ నిర్లక్ష్యం కారణంగానే రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయన్నారు. విద్యుత్ షాక్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, అప్రకటిత విద్యుత్ కోతలు ఆపాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేతలు ఎస్‌ఈ కార్యాలయంలో శుక్రవారం వినతి పత్రం అందజేశారు.
నిర్లక్ష్యమే కారణం..
అవినాష్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా హోంగార్డు జానీ చనిపోయారన్నారు. అలాగే ఈట్‌స్ట్రీట్‌లో ప్రైవేటు వ్యక్తులు జనరేటర్, గ్యాస్, వాటర్ పేరిట దందా చేస్తున్నారని ఆరోపించారు. రోజుకు ఒక్కో షాపు నుంచి రూ. వెయ్యి నుంచి రూ. 1500 వసూలు చేస్తున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తుల జనరేటర్ దందా కారణంగా ఈట్ స్ట్రీట్‌లో సూర్యప్రకాష్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని మృతుల కుటుంబాలకు చెరో రూ.50లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలో అప్రకటిత విద్యుత్ కోత కొనసాగుతోందన్నారు. కొండ ప్రాంతాలు, కరకట్ట ప్రాంతాలు, కాలనీల్లో రాత్రి 9 గంటలకు విద్యుత్ నిలిచిపోతే మరుసటి రోజు ఉదయం 6గంటలకు సరఫరా ఇస్తున్నారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం పెద్దలు, అధికారులు బుద్ది తెచ్చుకుని ప్రజానీకానికి మంచి చేయాలన్నారు. తక్షణమే బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలన్నారు.
లోపించిన జవాబుదారీతనం..
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ నగరంలో విద్యుత్ శాఖ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలు, ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అధికారులు విద్యుత్ కోతలు లేవని చెబుతున్నారని, కానీ సమయం, సందర్భం లేకుండా రెండు, మూడు గంటల పాటు అర్ధరాత్రి వేళల్లో విద్యుత్ కోతలు పెడుతున్నారన్నారు. నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖ పూర్తిగావిఫలమయ్యాయన్నారు. జవాబు దారీతనం లోపించిందన్నారు. గాలి వానలకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫల మైందన్నారు.
ఇవి ప్రభుత్వ హత్యలే..
మాజీ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొద్దిపాటి గాలివానకే విజయవాడ నగరంలో అతలాకుతలం అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఒక్కరోజే రెండు నిండు ప్రాణాలు బలైపోయాయన్నారు. ఇవి పూర్తిగా ప్రభుత్వ హత్యలేనన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.


