ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం శనివారం ఉదయం 10గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో జరగనుంది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ బోర్రా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు ఆలయ ఈవో శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు, ఏఈవోలు హాజరుకానున్నారు.
31న గిరి ప్రదక్షిణ..
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ 31వ తేదీన జరగనుందని వైదిక కమిటీ పేర్కొంది. 31వ తేదీ తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులతో గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు. అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ కుమ్మరి పాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.
3న కానుకల లెక్కింపు..
దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించే కానుకలు, ముడుపులు, మొక్కబడులను జూన్ 3వ తేదీన లెక్కించనున్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు మహా మండపం ఆరో అంతస్తులో కానుకల లెక్కింపు ప్రారంభం కానుంది. లెక్కింపును దేవస్థానం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడంతో పాటు ఆలయ అధికారులు, పోలీసు, ఎస్‌పీఎఫ్ సిబ్బంది బందోబస్తు మధ్య లెక్కింపు జరగనుంది.


