పెనమలూరు: కానూరులో యోగా శక్తి సాధనసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం కానూరులో వివరాలు తెలుపుతూ జూన్ 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కానూరు అశోక్‌నగర్ ఇండియన్ ఓం కార్యాలయంలో ఉత్సవాలు ప్రారంభించి నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలలో భాగంగా అవగాహన సదస్సులు, ఆరోగ్య శిబిరాలు, వైద్య కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ముఖ్యంగా నొప్పులకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విజయవాడ, పిఠాపురం, రేపల్లె, గుడివాడ, ఉయ్యూరు, బాపట్ల, విశాఖపట్నం ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలలో పాల్గొనే వారు 9000347369కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని మాకాల సత్యనారాయణ సూచించారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం బ్యారేజీ 56వ కానా వద్ద మృతదేహం ఉన్నట్లు వన్‌టౌన్ పోలీసులకు సమాచారమందింది. దానిపై పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని వద్ద ఎటువంటి గుర్తింపు కనపడలేదు. మృతుని వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


