నేరగాళ్లతో మిలాఖత్..
సాక్షి, టాస్క్‌ఫోర్స్: దొంగ బంగారం కొనుగోలుకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కేంద్రంగా మారింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా దందా సాగుతోంది. కొందరు స్థానిక వ్యాపారులు ఈ దొంగ బంగారాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ నేరగాళ్లకు సహకరిస్తున్నారు.
భారీగా బంగారం వ్యాపారం..
రాష్ట్ర స్థాయిలోనే జగ్గయ్యపేటలో బంగారం, వెండి వస్తువులు తయారీ, కొనుగోళ్లకు ఎంతో ప్రసిద్ధి. వందేళ్లుగా ఇక్కడ క్రయ విక్రయాలు కోట్ల రూపాయల్లో జరుగుతాయి. పట్టణంలో 95కి పైగా బంగారు, వెండి దుకాణాలు ఉన్నాయి. ప్రతిరోజు బంగారం మూడు కేజీలు, వెండి 5 నుంచి 10 కేజీల వరకు కొనుగోళ్లు జరుగుతాయి. ప్రతి నెలలో 25 రోజుల పాటు 80 నుంచి 100 కేజీల బంగారం, వెండి 100 నుంచి 200 కేజీల వ్యాపార అమ్మకాలు జరుగుతాయి. దీంతో దుకాణాలు నిత్యం వినియెగదారులతో కళకళలాడతాయి.
దొంగలకు పేట అడ్డా..
తెలంగాణకు సరిహద్దుగా జగ్గయ్యపేట ప్రాంతం ఉండటంతో దొంగలు దోచుకున్న బంగారాన్ని అమ్ముకునేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోదాడ, సూర్యా పేట, హుజుర్‌నగర్, మల్లారెడ్డిగూడెం, ఏపీలోని గుంటూరు, పల్నాడుజిల్లా పరిధిలోని పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మాచర్ల, నరసరావుపేట, ప్రాంతాల్లో అపహరించిన బంగారం వస్తువులను ఈ ప్రాంతంలోని కొన్ని బంగారు దుకాణాలకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతినెల సూమారు 500 గ్రాముల నుంచి కిలో వరకు అపహరించిన బంగారు వస్తువులను అమ్మకాలు చేస్తుంటారు. ఇందుకు యజమానులు కూడా సంబంధించిన బిల్లులను కూడా చూడకుండా వస్తువులను కొనుగోలు చేసి వాటికి బదులుగా నగదును చెల్లిస్తున్నారు.
మఫ్టీలో పోలీసులు..
పేట పట్టణానికి పోలీసులు అధికంగా రికవరీ కోసం వస్తున్నారు. ప్రతినెలలో కనీసం 10 నుంచి 15 సార్లు దొంగతనానికి గురైన బంగారాన్ని రికవరీ చేసేందుకు నల్గొండ, గుంటూరు, దాచేపల్లి మిర్యాలగూడకు చెందిన పాలీసులు మఫ్టీలో దుకాణాల వద్దకు బంగారం అమ్మిన వ్యక్తులను తీసుకుని వస్తుంటారు.
నామమాత్రంగా రికవరీలు..
గడిచిన రెండేళ్లలో ఏపీ–తెలంగాణ పోలీసులు నామమాత్రంగా రికవరీలు చేస్తున్నారు. 2025లో ఏప్రిల్‌లో కోదాడలో 100గ్రాముల బంగారం అపహరించిన కేసులో పోలీసులు పట్టణంలోని ఓ దుకాణంలో విక్రయించగా అపహరించిన దొంగ సమాచారం మేరకు యజమానిని అరెస్ట్ చేశారు. అదే ఏడాది నేల కొండపల్లిలో మూడు తులాల బంగారాన్ని ఓ దుకాణంలో రికవరీ చేశారు. తాజాగా ఈ నెల 19న పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు వచ్చి ఓ దుకాణంలో 100గ్రాముల బంగారం రికవరీ చేసేందుకు దొంగను బేడీలతో దుకాణానికి తీసుకువచ్చి విచారించారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు..
జగ్గయ్యపేటలో కోట్లాది రుపాయల బంగారు క్రయ విక్రయాలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఇక్కడ బంగారం ఎక్కడి నుంచి వస్తోంది? అందుకు సంబంధించిన రికార్డులు, అనుమతులు ఉన్నయో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
దొంగ బంగారం కొనుగోలుకు
కేంద్రంగా జగ్గయ్యపేట
నేరగాళ్లకు సహకరిస్తున్న
కొందరు వ్యాపారులు
రాష్ట్ర సరిహద్దు కావడంతో
యథేచ్ఛగా దందా
తెలంగాణ రాష్ట్రం నుంచి
అత్యధికంగా రికవరీ కేసులు
పట్టణంలో వరుసగా ఇటువంటి సంఘటనలు జరుగుతుండటంతో యజమానులకు, దొంగలకు మధ్య బలమైన బంధం ఉందనే విమర్శలు వస్తున్నాయి. రికవరీకి పోలీసులు దుకాణాలకు వస్తే కొందరు వర్తక సంఘ నాయకులు వారితో మాట్లాడి, సెటిల్‌మెంట్ చేసి పంపించి వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దొంగిలించిన బంగారాన్ని రికవరీ చేసుకోవడం, కేసును క్లోజ్ చేయడం వరకూ పోలీసులు పరిమితం అవుతుండగా.. బంగారం కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు.


