ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఘాట్‌రోడ్డు మరమ్మతు పనులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో క్షేత్ర స్థాయిలో కార్మికులు పని చేయడం కష్టతరమని, అదే సమయంలో రోడ్డు రిపేరు పనులకు ఉపయోగించే రసాయనాల మిక్సింగ్‌లో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆర్‌అండ్‌బీ అధికారులు తేల్చి చెప్పారు. గురువారం దుర్గగుడి ఈవో శీనానాయక్, ఆర్‌అండ్‌బీ విభాగం అఽధికారులు ఘాట్‌రోడ్డును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎండల తీవ్రత, వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండటంతో రోడ్డు పగుళ్లు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రస్తుతానికి ఘాట్‌రోడ్డు మరమ్మతు పనులను నిలిపివేసి, భక్తుల రాకపోకలతో పాటు వాహనాల రాకపోకలకు అనుమతించాలని దేవస్థానం నిర్ణయించింది. శుక్రవారం నుంచి ఘాట్‌రోడ్డుపైకి భక్తుల రాకపోకలను అనుమతిస్తారు.
5 నుంచి సంగమం వద్ద పవిత్ర హారతులు
ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ నదీ హారతులను జూన్ 5వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించేందుకు దుర్గగుడి అధికారులు నిర్ణయించారు. సంగమం వద్ద హారతులను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని దుర్గగుడి ఈవో ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నవహారతులను శాస్త్రోక్తంగా, ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలను ఇవ్వాలని వైదిక కమిటీని కోరారు.


