పనుల్లో నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం | - | Sakshi
Sakshi News home page

పనుల్లో నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం

May 29 2026 8:22 AM | Updated on May 29 2026 8:22 AM

పనుల్లో నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం

నిబంధనలు పాటించకపోతే చర్యలు

కంకిపాడు: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు ప్రహసనంగా సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పనులు అడ్డగోలుగా జరుగుతున్నాయి. ఈ కారణంగా రూ.కోట్ల నిధులు వెచ్చించినా అవి నిరుపయోగంగా మారుతున్నాయి. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2026–27 సంవత్సరానికి గానూ 31.54 లక్షల పనిదినాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 3.09 లక్షల జాబ్‌కార్డులు ఉండగా 1.40 మంది కార్డుదారులను ఉపాధి పనులకు వచ్చే వారిగా గుర్తించారు. ఈ ఏడాది 1.22 లక్షల మందితో ఉపాధి హామీ అధికారులు ఇండెంట్‌ పెట్టారు. 1.77 లక్షల పనులను గుర్తించగా, 198 పనులు ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులకు గానూ ఈ ఏడాది మే నెల 5వ తేదీ వరకూ వేతనాలు చెల్లింపులు జరిగాయి. రూ 70.86 కోట్లు వేతనాల రూపంలో కూలీలకు చెల్లింపులు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

అస్తవ్యస్తంగా పనులు...

లక్ష్యం భారీగా నిర్దేశించుకున్నా ఆశించిన స్థాయిలో పనులు జరగటం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఉపాధి పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. ఈ సీజన్‌లో పంట బోదెల తవ్వకాలు, చెరువుల పూడికతీత పనులను చేపట్టారు. ఉద్యానశాఖ పనులకు కార్యాచరణ రూపొందించారు. అయితే రైతులకు ఉపయుక్తంగా ఉండేలా ఈ సీజన్‌లో పంట బోదెల తవ్వకాలు చేపట్టారు. నిర్దేశిత లోతు, వెడల్పున తవ్వకాలు చేపడుతున్నారు. కానీ పనులు మాత్రం నిబంధనలకు అనుగుణంగా సాగటం లేదు. బోదెల తవ్వకంలో వచ్చిన మట్టిని కూలీలు బోదెల గట్లపైన పడేయాలి. కానీ కూలీలు బోదె అంచులు లోపలి వైపునే మట్టిని పడేస్తున్నారు. కొన్ని చోట్ల నేలను పారలతో చెక్కుకుంటూ, కాలువ అంచులను సైతం నిర్దేశిత లోతు కనిపించేలా చెక్కుతూ చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారుల పర్యవేక్షణ లోపం..

ఉపాధి పనుల్లో అధికారుల పర్యవేక్షణ లోపం ప్రధానంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో కూలీలు, మేట్‌ల పనితీరుపై పర్యవేక్షణ కొరవడటంతో పనులు నిరుపయోగంగా మారుతున్నాయి. కాలువలకు నీరు విడుదల చేసిన సమయంలో కాలువల అంచుల్లో మట్టి కరిగి బోదెలు పూడుకుపోయే పరిస్థితి నెలకొంది. తద్వారా కాలువ చివరి భూములకు సాగునీరు చేరాలనే లక్ష్యం నెరవేరకుండా పోతోంది. ఉపాధి పనులు నిర్వహించినా మట్టి గట్ల మీద వేయకుండా పనులు చేసుకుంటూ పోతే ప్రయోజనం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఒకే పని రెండు సార్లు..

గతంలో నిర్వహించిన సామాజిక తనిఖీల్లో తనిఖీ బృందాలు ఒకే కాలువ పూడికతీత రెండు పర్యాయాలు చేపట్టారని, కొలతల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ అనేక సభల్లో సమస్య లేవనెత్తారు. దీనికి ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారుల నుంచి సొమ్ము రికవరీ చర్యలూ తీసుకున్నారు. దీన్ని బట్టి అధికారుల పనితీరు క్షేత్రస్థాయిలో ఏ మేరకు సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రహసనంగా ఉపాధి హామీ పనులు

రూ.కోట్ల నిధులు వెచ్చించినా నిష్ప్రయోజనం

సాగునీటి సరఫరా సమయంలో తిరిగి యథాస్థితికి కాలువలు

ఉపాధి పనుల్లో నిబంధనలు పాటించాల్సిందే. నిబంధనలకు అనుగుణంగా పనులు జరగకపోతే అధికారులుపై చర్యలు ఉంటాయి. నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి. పనుల్లో లోపాలు తలెత్తితే సహించేది లేదు. ఉపాధి పనులు ఉపయుక్తంగా సాగాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. ఉపాధి పనులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.

శివప్రసాద్‌ యాదవ్‌, డ్వామా పీడీ, కృష్ణాజిల్లా

Advertisement
 
Advertisement
Advertisement