చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం నార్త్ మండలం పొట్లపాలెం పంచాయతీ పరిధిలోని కొత్తపూడి గ్రామ దళిత, పేద రైతుల పొలాల్లో ముందస్తు సమాచారం లేకుండా హైటెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులు మార్కింగ్ ఇవ్వటం పట్ల మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సంబంధించి గ్రామస్తులు గురువారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతు పలికేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ రైతులకు తాను అండగా ఉంటానన్నారు. 1994–95లో అప్పటి ప్రభుత్వం ఈ ప్రాంతంలోని దళిత, పేద కుటుంబాలకు జీవనాధారంగా తలొక ఎకరం భూమి పట్టాలు ఇచ్చిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆ పేదల కలలను నిజం చేస్తూ పట్టా భూములన్నింటికి సర్వ హక్కులతో కూడిన ప్రైవేటు ఆస్తులుగా (ప్రీ హోల్డ్) మార్చటం జరిగిందన్నారు. కాని నేడు మచిలీపట్నం పోర్టు అవసరాల పేరుతో ఆ భూములను నిలువునా ముంచేందుకు అధికారులు సిద్ధమయ్యారని ఆరోపించారు.
హైటెక్ విద్యుత్ లైన్లతో
భూమి విలువ పతనం...
ఈ హైటెక్ విద్యుత్ వైర్లు ఏర్పాటు చేస్తే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా, సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు వచ్చి పొలాల మధ్యలో హెవీ విద్యుత్ టవర్ల కోసం మార్కింగ్ చేయటంపై రైతులు కన్నీరు, మున్నీరవుతున్నారన్నారు. లైన్ల ఏర్పాటు వల్ల భూమి విలువ శూన్యంగా మారుతుందని, భవిష్యత్తులో ఆ భూమిని ఎవరు కొనలేరని కనీసం బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడానికి కూడా పనికిరాకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఈ ఎకరం భూమే జీవనాధారమని దీనిని కూడా కోల్పోతే వారి బతుకులు అంధకారమవుతాయన్నారు.
అత్యుత్తమ పరిహారం అందించాలి...
విద్యుత్‌లైన్ల ఏర్పాటు కోసం పూర్తి భూసేకరణ జరపాలని, విద్యుత్ టవర్లు వేసి వదిలేయటం కుదరదని పేర్ని నాని తేల్చి చెప్పారు. ఆలైన్లు వెళ్లే పొలాలను ప్రభుత్వం కొనుగోలు చేసి భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా రైతులు సంతోషపడేలా అత్యుత్తమ పరిహారాన్ని అందించాలని కోరారు. రైతులు చిరునవ్వుతో భూములను అప్పగించేలా నష్టపరిహారం చెల్లించిన తరువాతే పనులను ప్రారంభించాలని సూచించారు. పేద రైతుల పొలాల్లో బలవంతంగా పనులు చేపడితే తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మట్టా మోహననాంచారయ్య, వన్నెంరెడ్డి రామకృష్ణ, గాజుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సమాచారం లేకుండా విద్యుత్
స్తంభాలు ఏర్పాటు తగదు
బలవంతంగా పనులు చేపడితే ఊరుకోబోం
రైతులకు మద్దతు పలికిన మాజీ మంత్రి పేర్ని నాని


