ఈగల్ టీమ్ చీఫ్ ఎ.రవికృష్ణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చదరంగంఆడటం వల్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఈగల్ టీమ్ చీఫ్ ఎ.రవికృష్ణ చెప్పారు. హరియాణాకు చెందిన గ్రాండ్‌మాస్టర్ హిమాన్షు శర్మ ఆధ్వర్యంలో గుణదలలోని నెక్ట్స్‌జెన్ స్కూల్ ఆవరణలో జరుగుతున్న జరుగుతున్న ఫ్రీ చెస్ కోచింగ్ క్యాంప్‌ను రవికృష్ణ గురువారం సందర్శించారు. హిమాన్షుతో కలిసి కొద్దిసేపు చెస్ ఆడారు. చెస్ ఆటలో నెక్ట్స్ లెవల్‌కు వెళ్ళడానికి ఇలాంటి క్యాంపులు దోహదం చేస్తాయని రవికృష్ణ చెప్పారు. ఉచితంగా క్యాంప్ నిర్వహిస్తున్న చెస్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై శుక్రవారం విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో గోగినేని రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఖమ్మం నుంచి విజయవాడ వస్తూన్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని గుర్తించిన విధుల్లోని సిబ్బంది విజయవాడ జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించడంత హెడ్‌కానిస్టేబుల్ రాజా సిబ్బందితో కలసి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుని వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, వంటిపై మెరున్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్‌పీ స్టేషన్‌లో సంప్రదించాల్సిందిగా కోరారు.
గృహోపకరణాలు అగ్నికి ఆహుతి
జగ్గయ్యపేట అర్బన్: విద్యుత్ శాఖ వైఫల్యం కారణంగా హై వోల్టేజ్ విద్యుత్ సరఫరా కావడంతో అగ్ని ప్రమాదం జరిగి రూ.4 లక్షల విలువైన గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన జగ్గయ్యపేట పట్టణంలో గురువారం జరిగింది. స్థానిక బలుసుపాడు రోడ్‌లోని శ్రీకనకదుర్గమ్మ ఆలయం ఆర్చ్ ఎదురుగా ఉన్న గోనుగుంట్ల ధనుంజయ గృహంలో తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పడకగదిలో నిద్రిస్తున్న ధనుంజయ తండ్రి మీద నిప్పులు పడి బట్టలు కాలిపోవడంతో తేరుకుని ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏసీ, టీవీ, కబోర్డులు, కరెంట్ వైరింగ్, కరెంట్ సామాన్లు పూర్తిగా దగ్దం అయి, గోడలు ధ్వంసం అయ్యాయి. కరెంట్ హై వోల్టేజ్ వలన ప్రమాదం జరిగిందని గుర్తించే లోగా నష్టం జరిగిపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు.


