కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజల్‌లపై వసూలు చేస్తున్న అదనపు వ్యాట్, రోడ్డు డెవలప్‌మెంట్ సెస్‌లను తక్షణమే రద్దు చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి.సాంబిరెడ్డి, ఎం.వి.ఆంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్ధికశాఖా మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలకు మెమొరాండాలను ఈ మెయిల్ ద్వారా పంపినట్లు పేర్కొన్నారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అమెరికా ఆదేశించిందని రష్యా వద్ద చౌకగా లభించే ఆయిల్‌ను కొనకపోవడం, 2002లో నాటి ఎన్‌డీఏ ప్రభుత్వం నియంత్రిత ధరల విధానాన్ని రద్దు చేయటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు పెట్రోల్, డీజల్ ధరలు పెరగటానికి ప్రధాన కారణాలని అన్నారు. ప్రభుత్వరంగంలోని ప్రతి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఏటా వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయని వాటి వార్షిక నివేదికలు తెలియజేస్తున్నాయని, అయినా నష్టాలలో ఉన్నాయని జరుగుతున్న ప్రచారం తప్పు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు కారణమవుతున్నాయని చెప్పారు. పెట్రోల్, డీజల్‌లపై పన్నులు, సెస్‌లు, డివిడెండ్ల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు రూ.7.57లక్షల కోట్లు చేరుతున్నాయని, అందులో కేంద్ర ఖజానాకు రూ.4.24లక్షల కోట్లు, రాష్ట్ర ఖజానాకు రూ.3.33 లక్షల కోట్లు చేరుతున్నాయని వివరించారు. మన రాష్ట్రంలో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్ ఉందని, అదనపు వ్యాట్ పెట్రోల్‌పై లీటరుకు రూ.4, డీజిల్‌పై రూ.3.07, రోడ్డు డెవలప్‌మెంట్ సెస్ పేరుతో లీటరుకు ఒక రూపాయి, దానిపై మరల వ్యాట్ వసూలు చేస్తున్నారని, వీటి ద్వారా ఏటా సుమారు రు.25 వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరుతుందన్నారు. వీటిలో కొంత తగ్గించినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై ఉన్న అదనపు వ్యాట్‌ను, రోడ్డు డెవలప్‌మెంట్ సెస్‌ను పూర్తిగా రద్దుచేయాలని,పెట్రోల్, డీజిల్‌లపై వసూలు చేస్తున్న 31శాతం, 22.5శాతం వ్యాట్‌ను కనీసం 20 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌లపై కేంద్రం విధిస్తున్న పన్నులను కొంతమేరైనా తగ్గించటం, నియంత్రిత ధరల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కోశాధికారి వి.సుందర రామరాజు, పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి అవనిగడ్డ పున్నారావు పాల్గొన్నారు.
నియంత్రిత ధరల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి
టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్


