విద్యుదాఘాతంతో చిన్నారి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో చిన్నారి మృతి

May 29 2026 8:22 AM | Updated on May 29 2026 8:22 AM

భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణాలు విడిచిన టన విజయవాడ రూరల్‌ జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. చల్ల ఏసుబాబు, నాగలక్ష్మి దంపతులు వైఎస్సార్‌ కాలనీలో బ్లాక్‌ నంబర్‌ 240 ఎఫ్‌ఎఫ్‌ 2లో నివసిస్తున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరూ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పెద్ద కుమార్తె చల్లా మాధవి (5) ఇతర పిల్లలతో ఆడుకుంటూ కాలనీలోని రోడ్డుకు అవతల ఉన్న బ్లాక్‌ నంబర్‌ 224 వద్దకు వెళ్లింది. అక్కడ చేతికి అందే ఎత్తులో ఉన్న విద్యుత్‌ బార్‌ వద్ద ఆడుకుంటుంది. ఆ సమయంలో విద్యుత్‌ బాక్స్‌లో ఏర్పాటు చేసిన వైర్లు చేతికి తగలటంతో కరెంట్‌ షాక్‌ కొట్టి చిన్నారి చనిపోయింది. తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి భోరున విలపించారు.

రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం డిమాండ్‌.. విషయం తెలుసుకుని కాలనీకి చేరుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోయి సత్యబాబు మాట్లాడుతూ రక్షణ లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్‌ బార్‌ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలు మార్లు ఫిర్యాదు చేశామని, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించడం వలనే చిన్నారి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబానికి విద్యుత శాఖ రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈవీ నారాయణ, నగర కార్యదర్శివర్గ సభ్యులు కె.సూరిబాబు, కె.రవి, జి.వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement