విజయవాడ నగరంలో...
ఉక్కపోతకు తోడు..కరెంట్ కోతలతో జనం విలవిల
విద్యుత్ ఓవర్ లోడుతోనూ తప్పని ఇబ్బందులు
విద్యుత్ శాఖలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నిర్వహణ లోపం
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనధికార విద్యుత్ కోతలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అనధికార విద్యుత్ కోతలు ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిన్నపాటి గాలులు వీస్తే చాలు ఆ ప్రాంతంలో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. మండుతున్న ఎండలు, ఉక్కపోతకు అనధికార విద్యుత్ కోతలు తోడవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం నిర్వహణ లోపమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 220 కేవీ / 132 కేవీ ఈహెచ్‌టీ (ఎక్స్‌ట్రా హై టెన్షన్) లైన్లు, వాటి కింద ఉన్న ఫీడర్లలో ఓవర్‌లోడ్ పడితే ఆ ప్రాంతాల్లో అనధికార కోతలు విధిస్తు న్నారని సమాచారం. ఓవర్ లోడ్ నమోదయ్యే ప్రాంతాల్లో ప్రభుత్వం ముందుగా కొత్త లైన్లు వేయకపోవడం, ఉన్న లైన్లను అప్‌గ్రేడ్ చేయకపోవడం, ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్ నిర్మాణాలు చేపట్టనందు వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గుణదల నుంచి ఆటోనగర్, గుణదల నుంచి గంగూరు, తాడికొండ నుంచి తాడేపల్లి 132 కేవీ లైన్ల పరిధిలో ఓవర్ లోడ్ కారణంగా వాటి పరిధిలోని ఫీడర్లలో అనధికారి కంగా విద్యుత్తు కోతలు విధిస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు, రాత్రి పది నుంచి 12 గంటల వరకు కోతలు విధిస్తున్నారు. జనవరిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గరిష్ట వినియోగం రోజుకు 18 మిలియన్ యూనిట్లు. మంగళవారం విద్యుత్ వినియోగం 27.54 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఈ పెరుగుదలను ముందుగా అంచనా వేసి, దానికి అనుణంగా చర్యలు తీసుకోవడంలో విద్యుత్ శాఖ యంత్రాంగం పూర్తిగా విఫలం కావడంతో అనధికార కోతలు తప్పడం లేదు.
గుణదల విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో
మంగళవారం ఎగసిపడుతున్న మంటలు
విజయవాడ నగరంలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు వైర్లు తెగి ఏడు ఫీడర్ల పరిధిలో గంటల తరబడి విద్యుత్ లేకుండా పోయింది. మంగళవారం రాత్రి గుణదలలో లైన్లు లూజుగా ఉండి, నిప్పురవ్వలు రాలి, గడ్డి తగలబడటంతోపాటు, ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ పరికరాలు దగ్ధమయ్యాయి. దీంతో గన్నవరం, గూడవల్లి, గుణదల, పాలిటెక్నికల్ కాలేజీ, ఎనికేపాడు ప్రాంతాల్లో మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. ఈ నెల 22వ తేదీనే గుణదలలో లైన్ల నుంచి నిప్పురవ్వలు పడినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో మంగళవారం ప్రమాదం జరిగింది. మైలవరం, జగ్గయ్యపేట, చిల్లకల్లు ప్రాంతాల్లో ఈదురు గాలుల కారణంగా సోమవారం నాలుగు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం రాత్రి వీచిన గాలులకు మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఫీడర్లు ట్రిప్పయ్యి రెండు, మూడు గంటల పాటు విద్యుత్ నిలిచిపోయింది.


