జూన్‌ 15 నుంచి సర్‌ సర్వే | - | Sakshi
Sakshi News home page

జూన్‌ 15 నుంచి సర్‌ సర్వే

May 28 2026 2:28 AM | Updated on May 28 2026 2:28 AM

జూన్‌ 15 నుంచి సర్‌ సర్వే కంచికచర్ల: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)కు సంబంధించి జూన్‌ ఐదు తేదీ నుంచి 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యకలాపాలు జరుగుతాయని ఆపై జూన్‌ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్‌ఓల ద్వారా ఇంటింటి సర్వే జరుగుతుందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. త్వరలో సర్‌కు షెడ్యూల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో కలెక్టర్‌ లక్ష్మీశ బుధవారం కంచికచర్లలో పర్యటించారు. బూత్‌ స్థాయి అధికారి (బీఎల్‌ఓ)తో మాట్లాడి ఆ ప్రాంత ఓటర్ల జాబితా సమాచా రాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చూడటంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లను సర్‌ ప్రక్రియ ద్వారా తొలగిస్తామన్నారు. నందిగామ ఆర్డీఓ అనిల్‌కుమార్‌ తహసీల్దార్‌ వి.మానస, పలువురు బీఎల్వోలు పాల్గొన్నారు.

వైద్య కళాశాల పనులను త్వరగా పూర్తిచేయాలి

చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం ప్రభుత్వ వైద్యకళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కృష్ణా కలెక్టర్‌ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్‌ సందర్శించి వివిధ భవనాల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కళాశాల పరిపాలనా విభాగం తరగతి గదులు, భోజన శాల విద్యార్థుల వసతి గృహాలు తదితర నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.. భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కలెక్టర్‌ వెంట ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్‌చార్జ్‌ వైస్‌ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆషాలత, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

ఎంఎస్‌ఎంఈ బలోపేతానికి యువశక్తి కృషి

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థాపకత శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాన్ని (ఈటీఎంపీ) ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఎంఈడీసీ)తో భారతీయ యువ శక్తి ట్రస్ట్‌ (బీవైఎస్‌టీ) ఒక ఆసక్తి పత్రంపై సంతకాలు చేసింది. విజయవాడలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కళా వేదికలో జరిగిన ‘ఒక కుటుంబం – ఒక వ్యవస్థాపకుడు ఎంఎస్‌ఎంఈ గ్రోత్‌ సమ్మిట్‌ 2026’ సందర్భంగా ఈ ఆసక్తి పత్రాలను పరస్పరం మార్చుకున్నట్లు మేనేజింగ్‌ ట్రస్టీ లక్ష్మీ వెంకటరామన్‌ వెంకటేశన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా క్రమబద్ధమైన శిక్షణ, మార్గదర్శకత్వం, డిజిటల్‌ లెర్నింగ్‌, పర్యావరణ వ్యవస్థ నిర్మాణ చర్యల ద్వారా నానో సూక్ష్మ పరి శ్రమలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

అధికారిక వెబ్‌సైట్‌లో

ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమోలు

మచిలీపట్నంఅర్బన్‌: కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మునిసిపల్‌, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ హైస్కూళ్ల విద్యార్థులకు సంబంధించిన ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షల మార్కుల మెమోలను అధికా రిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పాఠశాలల లాగిన్‌లలో షార్ట్‌ మెమోలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్‌లోడ్‌ చేసి పాఠశాల ముద్ర, సంతకంతో విద్యార్థులకు అందజేయాలని సూచించారు. విద్యార్థుల పేరు, ఇంటిపేరు, జన్మతేదీ తదితర వివరాలను విద్యార్థులు, తల్లిదండ్రులతో సమ గ్రంగా పరిశీలించి ధ్రువీకరించాలని పేర్కొన్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో స్కూల్‌ లాగిన్‌ సవరణల ఆప్షన్‌ ఈ నెల 29వ తేదీ నుంచి జూన్‌ నాలుగో తేదీ వరకు అందుబాటులో ఉంటుందని సూచించారు. అవసరమైన సవరణలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని పాఠశాలలకు తగిన సూచనలు జారీ చేసి పర్యవేక్షించాలని డీఈఓ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement