సీఎం చంద్రబాబుది క్రెడిట్‌ చోరీ | - | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబుది క్రెడిట్‌ చోరీ

May 28 2026 2:28 AM | Updated on May 28 2026 2:28 AM

● కన్వెన్షన్‌ సెంటర్‌ను వైఎస్‌ జగన్‌ నిర్మిస్తే బాబు ప్రారంభించారు ● మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతి వనంలోని కన్వెన్షన్‌ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించి క్రెడిట్‌ చోరీకి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అంబేడ్కర్‌ స్మృతి వనంలోని కన్వెన్షన్‌ సెంటర్‌ను వైఎస్సార్‌ సీపీ నాయకులతో కలిసి ఆయన బుధవారం సందర్శించారు. కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద సెల్ఫీ దిగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014–19 మధ్య చంద్రబాబు అమరావతిలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి విస్మరించారని గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నడిబొడ్డున రూ.400 కోట్లు ఖర్చు చేసి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనం, 200 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించారని గుర్తుచేశారు. బీఆర్‌ అంబేడ్కర్‌ జీవిత చరిత్రను భావితరాలకు తెలిపేలా డిజిటల్‌ మ్యూజియం, మల్టీపర్పస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారని పేర్కొ న్నారు. కన్వెన్షన్‌ సెంటర్‌ చాలా బాగుందని చంద్రబాబు సైతం బేషరతుగా మెచ్చుకున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రతి కార్యక్రమం తనదేనని చంద్రబాబు క్రెడిట్‌ చోరీకి పాల్పడటంపై మండిపడ్డారు.

ఈ రెండేళ్లలో ఏం చేశారో ప్రకటించాలి

వైఎస్‌ జగన్‌ కంటే ఎక్కువ చేస్తామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చిందని, ఈ రెండేళ్లలో ఆయన కంటే ఎక్కువ ఏం చేశారో మహానాడు వేదికగా ప్రకటించాలని సీఎం చంద్రబాబును మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తన రెండేళ్ల పరిపాలన గురించి ప్రజల ముందుకు వచ్చి చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. రెండేళ్ల పాలనలో ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ‘వంగవీటి మోహన రంగాను ఎవరు హత్య చేశారో మీకు తెలియదా? రంగా హత్య తర్వాత మీ మంత్రులు ఎందుకు రాజీనామా చేశారో’ సమాధానం చెప్పా లని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు గుండె సుందర్‌ పాల్‌, గుడిసె శ్యామ్‌బాబు, మాతా మహేష్‌, వెంకటరామిరెడ్డి, తోపుల వరలక్ష్మి, పేరం త్రివేణి, పసుపులేటి కోటేశ్వరరావు, డాక్టర్‌ రాంబాబు, సురేష్‌, మనోహర్‌, మజ్జి రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement