మత్స్యకారుల నిరసన | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల నిరసన

May 28 2026 2:28 AM | Updated on May 28 2026 2:28 AM

పాలకాయతిప్పలో

టూరిజం బోటు తరలింపును

అడ్డుకున్న గంగపుత్రులు

పర్యాటకం పేరుతో జీవనోపాధిపై

దెబ్బకొడుతున్నారని ఆగ్రహం

కోడూరు: సముద్ర వేటపై ఆధారపడి జీవనం సాగించే పాలకాయతిప్ప మత్స్యకారులు అటవీ అధికారులపై నిరసనకు దిగారు. పర్యాటక అభి వృద్ధి పేరుతో అటవీ అధికారులు సముద్ర శింకు వద్ద నుంచి సాగర సంగమం వరకు బోటు టూరిజం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యేక ట్రాలీపై టూరిజం బోటును అధికారులు సముద్రతీరానికి తీసుకువచ్చారు. దీనిని గమనించిన పాలకాయతిప్ప మత్స్యకారులు కరకట్ట వద్దే బోటు ఉన్న ట్రాలీని అడ్డుకొని శింకు వద్దకు వెళ్లడానికి వీలు లేదంటూ వాహనం ముందు బైఠాయించారు.

జీవనోపాధికే ప్రమాదమంటూ భావోద్వేగం

తరతరాలుగా సముద్ర శింకు వద్దే తమ వేట పడవలను నిలిపి, ఇక్కడే నుంచే సముద్ర వేటకు బయలుదేరి వెళ్తామని మత్స్యకారులు తెలిపారు. తుపాన్లు, అలల ప్రభావం ఎక్కువగా ఉండే సమయంలో కూడా ఈ ప్రాంతమే తమకు భద్రత కల్పించిందని, అలాంటి ప్రదేశాన్ని ఇప్పుడు టూరిజం అవసరాల కోసం వినియోగించాలనే ప్రయత్నం, తమ జీవనోపాధిపై ప్రభావం చూపు తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సముద్రం మా జీవితం.. పడవ మా ఆస్తి.. ఈ శింకే మా ఆశ్రయం’ అంటూ మత్స్యకారులు భావోద్వేగానికి లోన య్యారు. గ్రామపెద్దలు, మత్స్యకార సంఘాల నేలతో చర్యలు జరపకుండా అటవీ అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వేట పడవలను వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులు సూచించడం అసాధ్యమని, అటవీ అధికారులే టూరిజం స్పాట్‌ను వేరే ప్రాంతానికి మార్చుకోవాలని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. గతంలో ఈ విషయాలను పాలకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని మత్స్యకారులు వాపోయారు.

వివాదాన్ని సద్దుమణిచిన పోలీసులు

టూరిస్ట్‌ బోటును తీసుకువస్తున్న ప్రత్యేక ట్రాలీని మత్స్యకారులు అడ్డుకోవడం అటవీ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. అవనిగడ్డ సీఐ యువకుమార్‌, ఎస్‌ఐ చాణిక్య ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మత్స్యకారులతో మాట్లాడి వారి అభ్యంతరాలను తెలుసుకున్నారు. అనంతరం బోటును దింపకుండా తిరిగి అదే లారీలో వెనక్కి పంపించడంతో ఉద్రికత్త సద్దుమణిగింది.

Advertisement
 
Advertisement
Advertisement