గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కౌలు రైతుల రక్షణకు నూతన చట్టం తేవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల వాగ్దానం మేరకు కౌలు రైతులకు తక్షణమే గుర్తింపు కార్డులు జారీ చేయాలని, వాటి ఆధారంగానే వ్యవసాయ, ఉద్యాన, బ్యాంకు, మార్కెట్ తదితర పథకాలన్నీ వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విజయవాడలోని దాసరి భవన్‌లో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర సమితి విస్తృత సమావేశం సంఘం అధ్యక్షుడు ఎ.కాటమయ్య అధ్యక్షతన బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కౌలు రైతులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కౌలు రైతుల రక్షణకు నూతన చట్టం కావాలన్నారు. రెండేళ్లుగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేయకపోవడం దారుణమన్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు కేవలం పంట హామీపైనే రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలున్నా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ.. గ్రామ సభలు నిర్వహించి భూ యజమాని ప్రమేయం లేకుండానే కౌలురైతులను గుర్తించి, గుర్తింపు కార్డులు జారీ చేయా లని డిమాండ్ చేశారు. దేవాలయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు సైతం గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. కౌలు రైతుల సమస్యలపై జూన్ ఒకటో తేదీన కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందారావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు దొంత కృష్ణ, నేలపాల రామకృష్ణ, పి.వి. జగన్నాథం, వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


