● వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో పిల్లలకు
అందని పౌష్టికాహారం, క్రీడా పరికరాలు
● విడుదలైన రూ. 5.78 లక్షల
నిధులు ఏమైనట్టో..
● ఈ నెల 31తో ముగియనున్న
వేసవి క్రీడా శిక్షణ
● అధికారుల తీరుపై విమర్శల వెల్లువ
మచిలీపట్నంఅర్బన్: క్రీడలకు విడుదల చేసిన నిధులు దోచుకుంటూ, ప్రభుత్వం అందించిన క్రీడా పరికరాలు దాచుకుంటున్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారుల తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఉచిత వేసవి శిక్షణా శిబిరాల కోసం ప్రభుత్వం రూ. 5,78,860 విడుదల చేసింది. అందులోనే రూ.1.53 లక్షలు అవసరమైన ఆట పరికరాల కొనుగోలు, ఒకొక్క కోచ్‌కు రూ. 2 వేలతో పాటు రవాణా ఖర్చులకు రూ. వెయ్యి, శిక్షణకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి రోజుకు రూ.10 చొప్పున పౌష్టికాహారం అందించేందుకు జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఖాతాకు నిధులు అందాయి. పిల్లలకు ఇచ్చే రూ.10లో రూ.4 విలువైన చిక్కీ, మిగిలిన రూ.6తో ఇతర పౌష్టికాహారం అందించాలని ఉంది. అయితే శిబిరాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం పంపిం చిన చిక్కీలు సైతం పంపిణీ చేసిన పరిస్థితి లేదు. కేవలం శిక్షణ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ, పిల్లలకు అందాల్సిన సదుపాయాలను నిర్లక్ష్యం చేస్తూ నిధులు దోచుకుంటున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు అధికారులు.
వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు:
అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ తదితర క్రీడలకు సంబంధించిన పరికరాలతో పాటు, అదనపు కొనుగోళ్ల కోసం రూ.1.53 లక్షల నిధులు జిల్లాకు విడుదలయ్యాయి. క్షేత్రస్థాయిలో మాత్రం హర్డిల్స్ మినహా ఇతర పరికరాలు ఇప్పటివరకు శిక్షణ కేంద్రాలకు చేరలేదు. విడుదలైన నిధులతో అవసరమైన పరికరాల కొనుగోలు ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతోందని, వేసవి శిబిరాల పేరుతో నిధులు పక్కదారి పడుతున్నాయని క్రీడావర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కొనుగోలు ప్రతిపాదనలు ఇలా:
జిల్లాలో ప్రస్తుతం 16 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు మాత్రమే నిర్వహిస్తుండగా, వాటిలో 18 రకాల క్రీడలకు సంబంధించిన శిక్షణ అందుబాటులో ఉంది. అయితే జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మాత్రం 55 రకాల క్రీడా పరికరాల కొనుగోలుకు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలపై క్రీడా వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్వహిస్తున్న క్రీడల సంఖ్యకు మించి పరికరాల కొనుగోలు ప్రతిపాదనలు ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఖేలో ఇండియా కేంద్రాల నిర్వహణ:
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఈత కొలను, బాక్సింగ్, హాకీ క్రీడలకు జిల్లా స్థాయి ఖేలో ఇండియా శిక్షణా కేంద్రాలను కొనసాగిస్తున్నారు. ఖేలో ఇండియా కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం వార్షికంగా రూ.5 లక్షల పునరావృత గ్రాంట్‌తో పాటు, రూ.5 లక్షల వన్‌టైమ్ గ్రాంట్‌ను అందిస్తోంది.
కృష్ణాజిల్లాలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో స్విమ్మింగ్‌కు సంబంధించి ఖేలో ఇండియా కేంద్రం కొనసాగుతున్నప్పటికీ, గత రెండేళ్లుగా స్విమ్మింగ్, హాకీ కోచ్లు లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కోచ్లు పేరుతో నిధులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ నిర్వహణ కూడా సరిగా లేదని, నీటిని సమయానికి మార్చకపోవడం, పరిశుభ్రత లోపించడం వంటి కారణాలతో పిల్లలు ఈత కొలనుకు రావడం లేదు.


