భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్ర బెటాలియన్ 17(ఎ) నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) కాకినాడ పరిధిలోని తొమ్మిది జిల్లాల ఎన్‌సీసీ విద్యార్థులకు రైఫిల్ షూటింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి వైఎస్సార్ కాలనీ రోడ్‌లోని ఎస్‌కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్ కమిటీ ముందుకు వచ్చింది. కోస్తా ఆంధ్రాలోని ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆయుధాలను ఉపయోగించడం, గురి చూడటం, కాల్పులు జరపడంలో శిక్షణ ఇచ్చేందుకు ఫైరింగ్ క్యాంప్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి హైస్కూల్ ఇది. బుధవారం హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్కూల్ ఇన్‌చార్జ్ సెక్రటరీ/కరస్పాండెంట్ తూనుకుంట్ల శ్రీనివాసు మాట్లాడుతూ విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపుతోపాటు క్యాడెట్లలో ధైర్యం, ఏకగ్రతను పెంచడమే ఫైర్ రేంజ్ ఏర్పాటు మఖ్య ఉద్దేశమన్నారు. దేశానికి సేవలు అందించే ఆర్మీ, అగ్నివీర్‌లలో చేరేందుకు ఎన్‌సీసీ ద్వారా అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. శిక్షణ జేసీఓ సుబేదార్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ క్యాడెట్ కార్‌ఫ్స్ వార్షిక శిక్షణలో భాగంగా క్యాడెట్లకు అబ్ట్పాకిల్ ట్రైనింగ్, ఫైరింగ్ ప్రాక్టీస్, టెంట్ పిచింగ్, ఫిజికల్ ట్రైనింగ్, డ్రిల్, వెపన్ ట్రైనింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలలో సమగ్ర శిక్షణ ఇస్తామని వివరించారు. బెటాలియన్ పరిధిలోని 537 మంది క్యాడెట్లకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
టెక్నాలజీపై గెస్ట్ లెక్చర్స్..
ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారాయణరావు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ టెక్నాలజీ వంటి అంశాలపై నిపుణులతో గెస్ట్ లెక్చర్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి.శ్యామల మాట్లాడుతూ క్యాడెట్లలో దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెంపొందించేందుకు ఈ ఫైరింగ్ క్యాంప్ దోహదపడుతున్నారు. కార్యక్రమంలో క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అజిత్ సింగ్ తోమర్, సుబేదార్ మేజర్ అనిల్ కుమార్ దహియ, కెప్టెన్ కేపీటీ విజయభాస్కర్ పాల్గొన్నారు.


