ఇంద్రకీలాద్రిపై కొండచిలువ కలకలం | - | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై కొండచిలువ కలకలం

May 28 2026 2:28 AM | Updated on May 28 2026 2:28 AM

ఇంద్రకీలాద్రిపై కొండచిలువ కలకలం

ఉడతను నోట కరచుకొని

చెట్టుపై నుంచి పడిన సర్పం

భయంతో మెట్ల పూజలను

నిలిపివేసిన భక్తులు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో పాత మెట్ల మార్గంలో బుధవారం ఉదయం కొండచిలువ కలకలం రేపింది. ఈ మార్గంలో వినాయకుడి గుడి, ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలకు పక్కనే చెట్టు ఉంది. బుధవారం తెల్లవారుజామున ఆరున్నర గంటల సమయంలో చెట్టుపై నుంచి సుమారు ఐదు అడుగుల పొడవైన కొండ చిలువ కింద పడింది. ఉడతను పట్టుకునే క్రమంలో అది కింద పడటంతో ఆ సమయంలో ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకుడు బెంబేలెత్తిపోయి కేకలు వేశారు. అమ్మవారి మెట్లకు పూజలు నిర్వహించేందుకు వచ్చిన మహిళలు సైతం కంగారు పడి కిందకు దిగిపోవడం కనిపించింది. ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి తెలిపిన అర్చకుడు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరాడు. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న శానిటేషన్‌ సిబ్బంది కొండ చిలువను పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. పది రోజుల కిందట ఇదే మెట్ల మార్గంలో శ్లాబ్‌ పెచ్చులు ఉడి పడి చిన్నారి గాయపడింది. మంగళవారం క్యూలైన్‌ మార్గంలో భక్తుడికి కుక్క కరిచింది. ఇప్పుడు తాజాగా బుధవారం కొండ చిలువ కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement