అప్పులు.. అభాసుపాలు! | - | Sakshi
Sakshi News home page

అప్పులు.. అభాసుపాలు!

May 27 2026 10:20 AM | Updated on May 27 2026 10:20 AM

వేతనాలూ లేవు..

గుడ్లవల్లేరు: చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ‘స్వర్ణ పంచాయతీ’ సైట్‌తో అవస్థలు తప్పడం లేదు. దీని కారణంగా జిల్లాలోని చాలా పంచాయతీలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. కృష్ణా జిల్లాలో 486గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఎన్నో పంచాయతీలకు బిల్లులు కాకపోవటంతో పరిపాలన కుంటు పడుతోంది. జిల్లాలోని పంచాయతీరాజ్‌ శాఖలో ఉన్నతాధికారుల అండదండలున్న కొంతమంది గ్రామ కార్యదర్శులకు మాత్రం భారీ మొత్తంలో బిల్లులు సత్వరమే విడుదల చేసేందుకు కొన్ని శక్తులు సహకరిస్తున్నాయి. కానీ మైనర్‌ పంచాయతీల్లో కనీసం చాటింపు వేయించేందుకు రూ.500 డ్రా చేయాలన్నా కష్ట సాధ్యమవుతోంది.

లక్ష్యాలకు దూరంగా..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ స్వచ్ఛపథం, స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర పథకాల లక్ష్యాన్ని పంచాయతీలకు అప్పగించింది. కానీ ఆ లక్ష్యాన్ని చేరేందుకు ఆయా పంచాయతీలు నానా అగచాట్లకు గురవుతున్నాయి.

● మేజర్‌, మైనర్‌ పంచాయతీల పరిధిలోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు ఉన్నా.. సీఆర్డీఏకు జమ అవుతున్నాయే తప్ప అందులో పంచాయతీలకు రావలసిన నిధులు అందడం లేదు.

● ఎన్నో ఏళ్లగా గ్రామ పంచాయతీలకు సర్కార్‌ ఇవ్వవలసిన స్టాంప్‌ డ్యూటీ నిధులను ఇవ్వటం లేదు. కేవలం పంచాయతీలకు వచ్చే నాన్‌ ట్యాక్స్‌, ఇంటి పన్నులు, నీటి పన్నులకు సంబంధించిన అరకొర నిధులతోనే పాలనా కాలాన్ని వెలిబుచ్చుతున్నారు.

● దీంతో నెలాంతపు ఖర్చులు, సిబ్బంది జీతాలు తలకు మించిన భారంగా మారాయి.

● మంచినీటి మోటార్ల రిపేర్లు, మురుగు కాల్వల్లో పూడికతీత వంటి పనులకు, పని వారికి వెంటనే డబ్బును అప్పటికప్పుడే చెల్లించకపోవటంతో ఆ పనులు చతికలబడిపోతున్నాయి.

● జిల్లా ఉన్నతాధికారుల అనుమతి లేనిదే చెత్త చేరవేసే వాహనాలకు సైతం కనీసం పెట్రోల్‌, డీజిల్‌ కూడా ఉండటం లేదు.

● రోజువారీ అవసరాల్ని బట్టి పంచాయతీల పరిధిలో పని చేసే మిషనరీలతో పాటు పని వారికి సొమ్ము చెల్లించలేక పోతున్నారు.

● కొన్ని పంచాయతీల్లో గత మార్చి వరకు చేయించిన పనులకు బిల్లులు చెల్లించవలసి ఉంది. ఏప్రిల్‌ నుంచి ఎం బుక్‌ ద్వారా చెల్లించవలసిన బిల్లులు కూడా కొన్ని పంచాయతీల్లో చెల్లించవలసి ఉంది.

● ఇదంతా ఏప్రిల్‌ నుంచి వచ్చిన నూతన స్వర్ణ పంచాయతీ సైట్‌లో సవరణలే కారణమని పంచాయతీలు భావిస్తున్నాయి.

అప్పులూ కరువు..

బిల్లుల ఫ్రీజింగ్‌ వల్ల పంచాయతీలకు పెట్టుబడులు పెట్టే నాథులు కూడా కరువయ్యారు. గతంలో ఇలాంటి ఇబ్బందులు వచ్చినపుడు గ్రామ కార్య దర్శులే ఖర్చు పెట్టేవారు. ఇపుడు వారికి అప్పులు ఇచ్చేవారు కూడా కరువయ్యారు. పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం పూర్తి కావటంతో ప్రత్యేకాధికారులు ఆ స్థానే వచ్చారు. కానీ వారు కూడా ఈ ఖర్చులను పెట్టేందుకు ససేమిరా అంటున్నారు.

స్వర్ణ పంచాయతీ సైట్‌తో తిప్పలు

బిల్లులు రాక కార్యదర్శులు సతమతం

బ్లీచింగ్‌, పైపులైన్ల రిపేర్లకు

నిధులు లేవు

అప్పుల్లో కూరుకుపోతున్న

పంచాయతీలు

పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాలను విడుదల చేస్తున్నామని చెప్పుకునే జిల్లా అధికారులు.. చర్యలు మాత్రం కంటి తుడుపుగా ఉంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తూతూమంత్రంగానే కొన్ని పంచాయతీలకే బిల్లులు ఆమోదిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. కొన్ని పంచాయతీలకై తే కనీసం బ్లీచింగ్‌కు బిల్లులను చెల్లించటంలో కూడా విఫలమవుతున్నారు. మంచినీటి పథకానికి చెందిన పైపులైన్ల రిపేర్ల ఖర్చుల బిల్లులకు మోక్షం లేకుండా పోయింది. నెలాంతపు ఖర్చుల బిల్లులు రాక నెలల తరబడి నానా ఇబ్బందుల్లో పంచాయతీలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement