ఆక్రమణలు తొలగించాలి..
●ఆదాయ వనరుగా మారిపోయిన
‘ఆపరేషన్ బుడమేరు’
● సెంట్రల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి
అండదండలతో దందా!
● ‘మామూళ్ల’ మత్తులో
కన్నెత్తి చూడని అధికారులు
● వరదొస్తే ప్రళయం తప్పదని
స్థానికుల ఆందోళన
సాక్షిప్రతినిధి,విజయవాడ: బుడమేరు.. ఈ పేరు వింటే నే విజయవాడ నగర ప్రజలు నేటికీ వణికిపోతుంటారు.. రెండేళ్ల క్రితం బుడమేరు వరదలు సృష్టించిన బీభత్సం స్థానిక ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తూనే ఉంది.. కొద్దిపాటి చినుకులు పడినా.. తుపాను వస్తోందనే హెచ్చరిక వినినా.. ఎటు నుంచి ఏ వరద ముంపు తమను ముంచేస్తుందోనంటూ ఆందోళన చెందుతూనే ఉన్నారు. వేలాది మంది ప్రజలు రోడ్డున పడినా.. వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగినా.. పదుల సంఖ్యలో అమాయక ప్రజలు అసువులు బాసినా.. ప్రభుత్వ పాలకులు, సంబంధిత అధికారులు అవేవి తమకు పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ప్రజాప్రతినిధి అండదండలతో..
స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో బుడమేరులో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. బుడమేరులో మట్టి, రాళ్లు పోసేసి పూడ్చేయడం.. వాటిని ప్లాటుగా మార్చేసి.. దొంగ సర్వే నంబర్లతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం.. నిబంధనలకు విరుద్ధంగా బఫర్ జోన్‌లలో అక్రమ నిర్మాణాలను చేపట్టడం చేస్తున్నారనే విమర్శ లు గుప్పుమంటున్నాయి. ప్రజాప్రతినిధికి ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే ఇద్దరు వ్యక్తులు బుడమేరు ఆక్రమణల్లో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది.
మామూళ్ల మత్తులో..
స్థానిక ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిళ్లు రావడం.. ఆక్రమణ దారుల నుంచి ముడుపులు అందుతుండటంతో బుడమేరులో ఇంత యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ, కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్, నీటి పారుదల శాఖ అధికారులెవ్వరూ కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శలు వస్తున్నాయి. బఫర్ జోన్‌లలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెబుతున్నా, ఫిర్యాదులు అందు తున్నా ‘మామూళ్ల’ మత్తులో అస్సలు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి అనుచరుడైన వ్యక్తితో కొంతమంది టౌన్‌ప్లానింగ్ అధికారులు కుమ్మక్కయ్యారనే విమర్శలు న్నాయి. కొంతమంది ఇరిగేషన్ అధికారులకు కూడా పెద్ద మొత్తంలో ఆమ్యామ్యాలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇవే నిదర్శనాలు..
స్థానిక న్యూరాజరాజేశ్వరీపేట, ఇందిరానాయక్‌నగర్, రామకృష్ణాపురం, సన్‌సిటీ కాలనీ, భరతమాత మందిర చివర భాగం, అయోధ్యనగర్ నుంచి న్యూఆర్‌ఆర్‌పేటకు వెళ్లే దారి, రాఘవేంద్ర థియేటర్ సమీపంలోని బుడమేరులో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయి. బుడమేరును పూడ్చేసి ప్లాట్లుగా మార్చడమే కాకుండా.. ఇక్కడ బఫర్ జోన్‌లలో భవనాలు, షెడ్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు బుడమేరులో ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
బుడమేరు వరదల్లో మేమంతా ఆర్థికంగా చాలా చితికిపోయాం. ఆ ప్రభావం నుంచి నేటికీ కోలుకోలేదు. వరదలు వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ ఆక్రమణలను తొలగించకపోగా కొత్తగా అడుగడుగునా బుడమేరును పూడ్చేస్తున్నారు. ఇలా అయితే కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా బుడమేరు కదిలే మార్గం లేక మళ్లీ ముంపు సమస్య వస్తుంది. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి మా కన్నీటి ఘోషను ఆలకించి బుడమేరును, మా కుటుంబాలను కాపాడాలని కోరుకుంటున్నాం.
– ఎస్.దుర్గారావు, న్యూఆర్‌ఆర్‌పేట


