లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, చందర్లపాటు ప్రాంతాల్లో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రత 47.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఎ. కొండూరులో 44.1 డిగ్రీలు నమోదైంది. కాగా కృష్ణాజిల్లాలోని కంకిపాడు, పెనమలూరులో అత్యధికంగా 45.8 డిగ్రీల నమోదు కాగా, ఘంటసాల, పమిడిముక్కలలో 45.5. మచిలీపట్నంలో 45.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పని ఉంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని చెబుతున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు ఎండలో తిరగవద్దని సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి..
ఎండల తీవ్రత దృష్ట్యా కార్మికులు, కర్షకులు వడగాడ్పులకు గురై మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో మంగళవారం సైతం వడదెబ్బ మరణాలు జరిగాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రతకు గురికాకుండా ఉండటం, ఎక్కువగా మంచినీరు తాగడంతో పాటు, కొబ్బరినీళ్లు, ఓఆర్‌ఎస్ ద్రావణం, మజ్జిగ సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 47.3,
కృష్ణాలో 45.8 డిగ్రీలు నమోదు


