చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

May 27 2026 10:20 AM | Updated on May 27 2026 10:20 AM

చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ(పీసీ–పీఎన్‌డీటీ) చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్‌ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ హెచ్చరించారు. సమన్వయ శాఖల అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు, డెకాయ్‌ ఆపరేషన్లను ముమ్మరం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం, ఏఆర్‌టీ–సరోగసీ చట్టాల అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, సెకండ్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జ్‌ కమ్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జ్‌ సునీల్‌ కుమార్‌ హాజరైన సమావేశంలో కమిటీ చైర్మన్‌, కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడారు.

పటిష్టంగా చట్టం అమలు..

జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఫిర్యాదులు వస్తే వాటిని త్వరితగతిన విచారించి, తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అన్నారు. జిల్లాలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుతమున్న స్కానింగ్‌ కేంద్రాలకు అదనంగా కొత్త రిజిస్ట్రేషన్లకు, రెన్యువల్‌ దరఖాస్తులు, మార్పుచేర్పుల (మోడిఫికేషన్‌) దరఖాస్తులను కమిటీ పరిశీలించి, ఆమోదం తెలిపింది. సరోగసీకి సంబంధించిన ఆరు దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.సుహాసిని, వాసవ్య స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జి.రేష్మీ, ఐవీఎఫ్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పద్మజ, ఎన్‌హెచ్‌ఎం డీపీఎంవో డాక్టర్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement