లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. విజయవాడతో పాటు పలు రూరల్ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కొద్దిపాటి వర్షం కురిసినప్పటికీ, సోమవారం ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు వడగాడ్పులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వడగాడ్పుల ప్రభావానికి గురైన చాలామంది పిట్టల్లా రాలుతున్నారు. బయటకు వచ్చిన వారే కాదు, ఇళ్లలో ఉన్న వారు సైతం హీట్‌స్ట్రోక్‌కు గురవుతున్నారు. అలాంటి వారు తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతుల వంటి సమస్యలతో ఆస్పత్రుల దారి పడుతున్నారు. వడదెబ్బ మృతుల్లో అధికంగా శ్రమ జీవులు, యాచకులే ఉంటున్నారు.
పెనమలూరు: జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్‌కు చెందిన తులసిరాణా(60) పోరంకిలో అపార్టుమెంట్‌లో కార్పెంటర్ పనికి వచ్చాడు. అతను శుక్రవారం పని చేస్తున్న సమయంలో ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బకు గురై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అతనిని చికిత్సకై ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న తులసి రాణా ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి అల్లుడు మనోజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.
ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామానికి చెందిన తంగిరాల వినోద్‌బాబు(34) భవన నిర్మాణ పనుల్లో భాగంగా టైల్స్ వేస్తుంటాడు. ఆదివారం పనికి వెళ్లిన వినోద్‌బాబు సాయంత్రం ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ఉయ్యూరులోని సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో విజయవాడ జీజీహెచ్‌కి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం వేకువ జామున మృత్యువాత పడ్డాడు. కాగా వినోద్‌బాబుకు తొలుత వైద్యుల పోస్టుమార్టం నిర్వహిస్తామని చెప్పారని, తర్వాత పోస్టుమార్టం చేయకుండానే పంపించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక సిద్ధార్థ జంక్షన్ సమీపంలోని నివాసం ఉంటున్న వెల్డింగ్ పనులు చేసే కార్మికుడు గొంగటి చంటి(45) వడదెబ్బతో మృతి చెందాడు. చంటి భార్య గతంలోనే చనిపోవడంతో తల్లి యశోదమ్మతో కలిసి సిద్ధార్థ జంక్షన్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. మధ్యాహ్నం వేళ చికెన్ తీసుకువస్తానని చెప్పి చంటి బయటకు వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిద్ధార్థ కళాశాల చెట్టు కింద మీ అబ్బాయి స్పృహతప్పి పడిపోయాడని స్థానికులు చంటి తల్లి యశోదమ్మకు సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే వచ్చి 108లో నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రికి వెళ్లిన కొద్దిసేపటికే చంటి మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.
● విజయవాడ సూర్యారావుపేటలో హోటల్ కార్మికుడు, హనుమాన్‌పేటలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు వడదెబ్బకు గురై మృతి చెందారు.
తిరువూరురూరల్: మండలంలోని వావిలాలలో వడదెబ్బకు ఇరువురు మృతిచెందారు. ఆదివారం రాత్రి షేక్ షఫీ కమృన్(87) అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించేలోపు మృతిచెందారు. వడదెబ్బకు ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన టైలరింగ్ వృత్తి నిర్వహించే షేక్ నాగుల్‌మీరా (52) శనివారం విధినిర్వహణలో ఉండగా వడదెబ్బకు గురయ్యారు. 108 అంబులెన్సులో తిరువూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం షేక్ నాగుల్‌మీరా మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇరువురు సంతానం.
ఇబ్రహీంపట్నం: మండుతున్న ఎండలకు తట్టుకోలేక వడదెబ్బ సోకి ఆవు మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం ఖాజీమాన్యంలో సోమవారం జరిగింది. ఇప్పటి వరకూ కొండపల్లి మునిసిపాలిటీలో ఎండవేడి గాలులకు మూడు ఆవులు చనిపోయాయి. మృతి చెందిన ఆవును కొండపల్లి మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్‌పై తీసుకెళ్ల్లి సమాధి కార్యక్రమం నిర్వహించారు. పశువులు వడదెబ్బకు గురైతే సకాలంలో వైద్య సేవలు అందించేందుకు టోల్‌ఫ్రీ నెంబర్ 1962కు ఫోన్ చేయాలని పశు వైద్యాధికారులు సూచించారు.
గన్నవరం: ఉంగుటూరుకు చెందిన షేక్ మౌలాలి(42) స్థానిక బుద్ధవరం రోడ్డులోని ఫీడ్ మిక్చర్ తయారీ కర్మాగారంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కర్మాగారం ఆవరణలో సోమవారం పనిచేస్తుండగా వడదెబ్బకు గురై మౌలాలి ఒక్కసారిగా కుప్ప కూలిపోయి మృతి చెం
దాడు. స్థానిక వెంకటేశ్వర థియేటర్ కాంప్లెక్స్‌లో టైలరింగ్ షాపులో పనిచేస్తున్న తాళ్లూరి విజయ్ కూడా వడదెబ్బకు గురై షాపులో మృతి చెందాడు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): అంబాపురం తోటమూల సెంటర్ వద్ద రోడ్డు మీద ఒక వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని ఆరా తీయగా సదరు మృతుడి వివరాలు ఎవరికీ తెలియదని సమాధానమొచ్చింది. అలాగే ఎండ వేడి తాళలేక మృతి చెంది ఉండవచ్చని స్థానికులు పేర్కొన్నారు. దానిపై కొత్తపేట పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జగ్గయ్యపేట: మండలంలోని బలుసుపాడుకు చెందిన బండ్ల శాంతమ్మ (80) ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తుంటుంది. ఎప్పటి మాదిరిగానే పనులకు వెళ్లి మధ్యాహ్న సమయంలో రావటంతో వడదెబ్బ తగిలి అస్తస్థతకు గురవటంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. మండలంలోని కె.అగ్రహారం గ్రామానికి చెందిన బొడ్డు శ్రీను(47) వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఆదివారం కూడా పొలం పనులకు వెళ్లి రాత్రికి ఇంటికి చేరాడు. దీంతో రాత్రి స్పృహ తప్పటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
వీరులపాడు: మండలంలోని జుజ్జూరు గ్రామానికి చెందిన కోపూరు మోషే (70) రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం కూడా తన పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి రాగానే అలసటగా ఉందని కుటుంబ సభ్యులకు తెలపటంతో గ్రామంలోని వైద్య సేవలందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో 14 మంది మృతి
మృతుల్లో కష్టజీవులు, యాచకులే అధికం
పీఎం చేస్తేనే వడదెబ్బగా గుర్తింపు
ఆస్పత్రుల్లో పీఎం చేయకుండానే పంపేస్తున్న వైనం
ఉమ్మడి కృష్ణాలో మరో ఐదు రోజుల పాటు ఎండలు ఇదే తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎవరూ ఉదయం 10 గంటల తర్వాత, సాయంత్రం 4 గంటల్లోపు బయటకు రావద్దని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా వడగాడ్పుల ప్రభావానికి వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, మద్యం తాగిన వారు త్వరగా గురయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
వడదెబ్బగా నమోదు ఎలా?
వడదెబ్బకు మృతి చెందినట్లు అధికారుల లెక్కల్లోకి ఎక్కాలంటే పోస్టుమార్టం రిపోర్టు తప్పనిసరి అని చెబుతున్నారు. కానీ జిల్లాలో వడదెబ్బ మృతులకు పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాలను బంధువులకు ఇచ్చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వడగాడ్పులకు మృతి చెందిన వారిని తొలుత ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందిన వారికి కూడా పోస్టుమార్టం నిర్వహించడం లేదు. మరి వడదెబ్బగా ఎలా నమోదు అవుతుందో అధికారులకే తెలియాలి.


