‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం నదిలో దూకి గుర్తు తెలియని యువకుడు మృతి హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్‌

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో సోమవారం తెలుగు పరీక్షతో ప్రారంభమయ్యాయి. జిల్లాలో 25 పరీక్ష కేంద్రాల్లో సోమవారం 1,680 మంది విద్యార్థులను కేటాయించారు. అందులో 1,298 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు విద్యార్థుల హాజరు శాతం 77.3గా ఉంది. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌. చంద్రకళ సోమవారం పరిశీలించారు. పటమట కేబీసీజెడ్పీ బాలుర హైస్కూల్‌, సత్యనారాయణపురంలోని ఏకేటీపీఎం హైస్కూల్‌, ముత్యాలంపాడులోని జీఎస్‌ఆర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల తదితర పరీక్ష కేంద్రాలను ఆమె తనిఖీ చేసి పరిశీలించారు. అలాగే మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 15 పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. సోమవారం ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని అధికారులు ప్రకటించారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): కృష్ణానదిలో దూకి యువకుడు మృతి చెందిన సంఘటన వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుర్తు తెలియని యువకుడు కృష్ణానదిలో కనిపించటంతో సోమవారం ఉదయం బ్యారేజీ సమీపంలోని వ్యక్తులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా ఆదివారం రాత్రి నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉన్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు. దీనిపై వన్‌టౌన్‌ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారమందించాలని అధికారులు కోరారు.

గుణదల(విజయవాడ తూర్పు): మద్యం మత్తులో చేతికందిన కత్తితో తన స్నేహితుడి పై దాడి చేసిన ఘటనలో ఓ వ్యక్తిని మాచవరం పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం మసీదు వీధికి చెందిన బండి వంశీబాబు(31) పెయింటింగ్‌ పనిచేస్తుంటాడు. ఈ నెల 24వ తేదీ రాత్రి పని ముగించుకుని తన స్నేహితులైన రాజు, వెంకట్‌లతో కలసి స్థానికంగా ఉన్న ఓ బార్‌ వద్ద మద్యం తాగారు. ఈ సమయంలో వంశీబాబుకు రాజుల మధ్య వాగ్వివాదం తలెత్తింది. క్షణికావేశానికి గురైన వంశీ కూరగాయలు తరిగే కత్తితో రాజుపై దాడికి దిగాడు. ఈ ఘటనలో రాజు తీవ్రంగా గాయపడ్డాడు. బార్‌ యజమాని మాచవరం పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజును వైద్యం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. ఉద్రేకంలో కత్తితో దాడి చేసిన వంశీబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement