అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

గన్నవరం: ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనపై గన్నవరం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. స్థానిక శ్రీనగర్‌కాలనీలో కాజ రజితకుమారి(58) జ్యోతి పేరిట పిండిమరను నడుపుతున్నారు. ఏడేళ్ల క్రితం ఆమె భర్త మృతి చెందగా, ఆమె ఇరువురు కుమార్తెలు అమెరికాలో ఉంటున్నారు. దీంతో ఆమె స్థానిక దావాజీగూడెం రోడ్డు పక్కన ఉన్న జీకేఆర్‌ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంటి పనులు చేసేందుకు వచ్చిన పని మనిషి బెడ్‌రూమ్‌లో మంచం పక్కన రజితకుమారి కింద పడి మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ శ్రీధర్‌ నేతృత్వంలో అక్కడికి చేరుకున్న సిబ్బంది మృతురాలి నోరు, ముక్కు వద్ద రక్తం ఉండటంతో అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు చేపట్టారు. అపార్టుమెంట్‌లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు.

పోలీసుల అదుపులో అనుమానితురాలు..

ఆదివారం రాత్రి 10.30గంటల సమయంలో నాలుగు నెలలు క్రితం రజితకుమారి పాత ఇంట్లో అద్దెకు ఉండి వెళ్లిన సుష్మ, ఆమె కుమారుడు అజయ్‌ ప్లాట్‌కు వచ్చినట్లుగా నిర్ధారించారు. అంతే కాకుండా రాత్రి 11 గంటల సమయంలో తల్లీకొడుకులు హడావుడిగా గేటు దూకి వెళ్లే ప్రయత్నంలో అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌ గమనించినట్లుగా విచారణలో తేలింది. రజితకుమారి మెడలోని బంగారు గొలుసు, ఆమె బ్యాగ్‌లోని నగదు మాయమైనట్లుగా గుర్తించారు. దీంతో డబ్బు, నగలు కోసమే రజితకుమారిని హత్యచేసి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే సుష్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపారు. క్లూస్‌ టీమ్‌ను కూడా రంగంలోకి దింపి నిందితుల వేలిముద్రలను సేకరించారు. అమెరికాలో ఉన్న కుమార్తెలు వచ్చే వరకు రజిత మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

నగదు, నగల కోసం హత్య చేశారా?

అనుమానితులను విచారిస్తున్న పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement