ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ఆలయ ప్రాంగణంలో మరిన్ని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దుర్గగుడి అధికారులకు సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ సోమవారం దుర్గమ్మ పంచహారతుల సేవలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు కలెక్టర్ లక్ష్మీశ ఆలయ ప్రాంగ ణానికి చేరుకోగా, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. పంచహారతుల సేవలో పాల్గొన్న అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద దేవస్థాన ఆధ్వర్యంలో నడుపుతున్న ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందుతున్న భక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజగోపురం ఎదుట ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులతో మాట్లాడారు. దుర్గగుడి ఈఈ ఎల్. రమా, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.


