కనుమురుగు కష్టం! | - | Sakshi
Sakshi News home page

కనుమురుగు కష్టం!

May 26 2026 8:00 AM | Updated on May 26 2026 8:00 AM

విజయవాడలో అస్తవ్యస్తంగా డ్రెయిన్లు చెత్తాచెదారంతో నిండిపోతున్న వైనం తూతూ మంత్రంగా పూడికతీత పనులు రోడ్లపైనే నిలిచిపోతున్న మురుగు నీరు

తూతూ మంత్రంగా పూడిక తీత

సాక్షి ప్రతినిధి, విజయవాడ: నగరంలో డ్రెయినేజీ అస్తవ్యస్తంగా మారింది. అవుట్‌ ఫాల్‌, స్ట్రామ్‌ వాటర్‌ డ్రెయిన్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వర్షాలు వచ్చినప్పుడు మంత్రులు, అధికారులు హడావుడీ చేయడం తప్ప క్షేత్ర స్థాయిలో సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు శూన్యం. చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులుగా మారిపోతున్నాయి. ఇక భారీ వర్షం పడితే గంటల తరబడి రోడ్లపైనే మురుగు తిష్టవేస్తోంది. వర్షం పడినప్పుడు కొన్ని రోడ్లలో ప్రయాణించాలంటే ప్రజలు వణుకుతున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ స్తంభించి అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాకాలానికి ముందే మురుగు కాలువల్లో పూడికతీత చేపట్టాల్సిన నగర పాలక సంస్థ అధికారులు నామ మాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు.

పూడికతీత అంతంత మాత్రమే..

మురుగునీరు, వర్షపు నీటి పారుదలకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 142 కిలోమీటర్ల మేర మేజర్‌ అవుట్‌ ఫాల్‌ డ్రెయిన్లు, 302 కిలో మీటర్ల మేర మైనర్‌ డ్రెయిన్లు ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జెండా చెట్టు, కేఎల్‌రావు నగర్‌, కబేళా, నైజాంగేటు సెంటర్‌ అవుట్‌ ఫాల్‌ డ్రెయిన్లు బుడమేరు కాలువలో కలుస్తాయి. డ్రెయిన్లలో సక్రమంగా పూడిక తీయకపోవడంతో మురుగునీటితో పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. సెంట్రల్‌ నియోజకవర్గంలోని సింగ్‌నగర్‌, ప్రకాష్‌నగర్‌, శాంతినగర్‌, రాజీవ్‌ నగర్‌, ఉడా కాలనీ, కండ్రిక ప్రాంతాల నుంచి వచ్చే నీరు కండ్రిక పంపింగ్‌ స్టేషన్‌ వాగు ద్వారా బుడమేరులో కలుస్తుంది. ఈ నియోజకవర్గంలో అవుట్‌ ఫాల్‌ డ్రెయిన్‌ వ్యవస్థ సక్రమంగా లేక ఇబ్బందులు తప్పడం లేదు. వరద నీరు డ్రెయిన్ల ప్రవహించకపోగా వెనక్కి తన్ని కాలనీలు, రోడ్లు ముంపుబారిన పడుతున్నాయి. డ్రెయినేజీ అస్తవ్యస్తంగా ఉండటంతో వల్లే రెండేళ్ల కిందట వచ్చిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రధాన డ్రెయిన్లయిన గుంటతిప్ప, పుల్లేరు, బుడమేరులో పూడిక నామమాత్రంగా తీశారు. తూర్పు నియోజకవ ర్గంలో పుల్లేటి కాలువ, గుంటతిప్ప డ్రెయిన్లు ప్రధానమైనవి. ఎల్‌అండ్‌టీ అవుట్‌ పాల్‌ డ్రెయిన్లు ఉన్నా పనిచేయటం లేదు. మొగల్రాజపురంలో కొండ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు రోడ్ల పైనే తిష్టవేస్తోంది. ప్రధాన డ్రెయిన్లు ప్రవహించే లబ్బీపేట, పిన్నమనేని పాలిక్లినిక్‌, గాయత్రీనగర్‌, ఎల్‌ఐసీ కాలనీ, ఎన్టీఆర్‌ కాలనీ, గుణదల, భారతీనగర్‌, గురునానక్‌ కాలనీ, మరుతి కో–ఆపరేటివ్‌ కాలనీ, ఆటోనగర్‌, అజిత్‌సింగ్‌ నగర్‌, మధురానగర్‌, పాయకాపురం, బెంజిసర్కిల్‌, పంటకాలువ రోడ్డు, తోటవారి వీధి, ఊర్మిళా నగర్‌, నిర్మల కాన్వెంట్‌ రోడ్డు, కృష్ణవేణి రోడ్డు, రమేష్‌ ఆస్పత్రి ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షానికే రోడ్లపై మురుగు, వర్షపునీరు పొంగి ప్రవహించి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డు ఎక్కడ ఉందో డ్రెయిన్‌ ఎక్కడ ఉందో తెలియక పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన అవుట్‌ ఫాల్‌ డ్రెయిన్లలో ఎప్పటికప్పుడు సిల్టు, వ్యర్థాలను తొలగించడంలో నరగపాలక సంస్థ అధికారులు విఫలం అవుతున్నారు. ప్రభుత్వం దీనిపైన దృష్టి సారిస్తే తప్ప సమస్య పరిష్కరం అయ్యే మార్గం కనిపించటం లేదు.

రూ.7.25 కోట్లతో పనులు

ఈ ఏడాది మేజర్‌ మురుగు కాలువలు, డ్రెయిన్లలో పూడికతీత పనుల కోసం నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో రూ.7.25 కోట్లతో 128.91 కిలో మీటర్ల మేర పూడికతీత పనులను చేపట్టారు. మేజరు డ్రెయిన్లు 480.02 కిలోమీటర్లు, మీడియం డ్రెయిన్లు 245.01 కిలో మీటర్ల మేర మరమ్మతులు తూతూ మంత్రంగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం సమీపిస్తోంది. డ్రెయిన్లలో పూడికతీత పూర్తిస్థాయిలో జరగడంలేదు. ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలంలో నగర వాసులకు మురుగు కష్టాలు తప్పేలా లేవని పలువురు పేర్కొంటున్నారు.

నగరంలో ఎక్కడా పూడికతీత పనులు జరుగుతున్నట్లు కనిపించడం లేదు. రైతు బజార్లలో, టీ స్టాల్‌ వద్ద, ప్రధాన కూడళ్లలో స్వచ్ఛభారత రేటింగ్‌ కోసం ఓటీపీల నమోదు ప్రక్రియ మాత్రం భారీగా జరుగుతోంది. వేసవి తాపం వల్ల పారిశుద్ధ్య పనులకు కార్మికుల హాజరు తగ్గింది. అనుకున్నంత స్థాయిలో అదనపు సిబ్బందిని నియమించిన దాఖలాలు లేవు. రుతు పవనాలు త్వరలో ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా పూడికతీత పనులు జరగడంలేదని భావిస్తున్నా.

– బుద్దె రాజా, ప్రధాన కార్యదర్శి, విజయవాడ మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ)

Advertisement
 
Advertisement
Advertisement