వృక్ష విలాపం! | - | Sakshi
Sakshi News home page

వృక్ష విలాపం!

May 25 2026 9:45 AM | Updated on May 25 2026 9:45 AM

వృక్ష విలాపం!

ఈ చెట్లు ఎంతో మేలు

వేప, మద్ది, రావి, మర్రి వంటివి క్షామాన్ని, తుపాన్లను కూడా తట్టుకుని నిలబడతాయి. స్థానిక జాతుల చెట్టుకు హరిత వైశాల్యం ఎక్కువ. ఇవి ఎక్కువ ప్రాణవాయువు విడుదల చేస్తాయి.

ఈ రకం చెట్లు వాన నీటిని భూగర్భంలో ఇంకేలా చేస్తాయి. వీటితో భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో 100 నుంచి 150 అడుగులకు నీటి మట్టం పడిపోయింది. ఇది మరింత పతనమయ్యే అవకాశం ఉంది. వృక్షాలు మేఘాలను ఆకర్షించి వర్షం కురిసేలా చేయడంలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి.

ఇలా చేయాలి

నగరంలో బందరు, రైవస్‌, ఏలూరు, బుడమేరు కాలువలు ఎక్కువ నిడివితో ఉన్నాయి. ఈ గట్లపై పచ్చదనాన్ని పెంపొందించాలి. కాలవ గట్లపె వెదురు చెట్లు వేస్తే ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి గుబురుగా పెరుగుతాయి. పక్షులకు సహజ ఆవాసంగా ఉంటాయి.

గుణదల, మొగల్రాజపురం, ఇంద్ర కీలాద్రి, గాంధీకొండ, ముస్తాబాద తదితర కొండలపై పచ్చదనం కోసం స్థానిక మొక్కలు పెంచాలి. పెద్దగా నీరు లేకపోయినా తట్టుకుని బతుకుతాయి. ఇలా చేస్తే నగర ఉష్ణోగ్రత 5 డిగ్రీల వరకూ తగ్గుతుంది. పార్కుల్లో స్థానికేతర రకాలను నాటే బదులు, స్థానిక రకాలకు ప్రాధాన్యమివ్వాలి.

జీవ వైవిధ్యం దెబ్బతింటోందంటున్న నిపుణులు

కాంక్రీట్‌ జంగిల్‌లా

విజయవాడ

ఒకప్పుడు కృష్ణమ్మ ఒడిలో పచ్చని చెట్లు, చల్లని గాలులతో కళకళలాడిన విజయవాడ నేడు కాంక్రీట్‌ జంగిల్‌లా మారిపోయింది. అభివృద్ధి, రోడ్ల విస్తరణ పేరుతో మహా వృక్షాలను కూల్చేస్తున్నారు. దీని ఫలితమే నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. స్వచ్ఛమైన గాలి కరువై ఊపిరి పీల్చడం కష్టమవుతోంది.

లబ్బీపేట(విజయవాడతూర్పు): పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్న విజయవాడ నేడు కాంక్రీట్‌ జంగిల్‌లా మారిపోయింది. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ రణగొణ ధ్వనులే. జనాభా పెరుగుతున్న కొద్దీ పచ్చదనం మాయమవుతోంది. ఉన్న కొద్దిపాటి చెట్లు కూడా ఎక్కువగా స్థానికేతర జాతులే. ఈ సంఖ్య తగ్గే కొద్దీ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రభావం పడుతుంది. పరోక్షంగా భూగర్భ జలాలు, వర్షపాతం తగ్గడం, అధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. జనవాస ప్రాంతాల్లో కనీసం 20 శాతం మేర మొక్కలు ఉండాల్సి ఉండగా, నగరంలో అత్యంత తక్కువ నాలుగు శాతమే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. నగరంలో ప్రతి వృక్ష విలాపంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.

అరకొరగానే..

ఒకప్పుడు ఎంజీ రోడ్డు, కార్ల్‌మార్క్స్‌ రోడ్లతోపాటు, ఇతర ప్రాంతాల్లో రహదారులకు ఇరువైపులా పచ్చని చెట్లు ఉండేవి. ట్రాఫిక్‌ పెరగడంతో రోడ్ల విస్తరణ పేరుతో వాటిని కొట్టేశారు. నగరపాలక సంస్థ ఉద్యానశాఖ గతంలో నిర్వహించిన సర్వేలో కేవలం 22,407 చెట్లు మాత్రమే ఉన్నట్లు తేలాయి. చిన్నా చితకా కలిపి మరో 30 వేలు వరకూ ఉండొచ్చని అంచనా. నగరం 60 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. దీనికి తగ్గట్లుగా మొక్కలు లేవు. స్థానిక జాతులైన మర్రి, రావి, మేడి, వేప, మారేడు, వెలగ, గానుగ, తుమ్మ, జువ్వి, గంగరావి, నేరేడు, ఉసిరి, కుంకుడు, కొబ్బరి, తాటి, మద్ది వంటి వాటి సంఖ్య తక్కువగా ఉన్నట్లు తేలింది. ఎర్రతురాయి, పచ్చతురాయి, నిద్రగన్నేరు, జామాయిల్‌, అశోక, బురుగుడు వంటివి స్థానికేతర రకాల కిందకు వస్తాయి.

దెబ్బతింటున్న జీవ వైవిధ్యం

స్థానిక వృక్షజాతులతో చాలా ప్రయోజనాలు ఉన్నట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వీటిపైనే పక్షులు ఎక్కువగా వాలతాయి. సీతాకోక చిలుకలు, తేనెటీగలు, తదితర వాటిని ఇవి ఆకర్షిస్తుంటాయి. వీటి సంఖ్య తగ్గేకొద్దీ జీవవైవిధ్యం దెబ్బతింటుంది. నగరంలో గతంలో కనిపించే ఎన్నో పక్షులు నేడు మచ్చుకై నా లేవు. పిచ్చుకల్లో ఐదు రకాలు ఉండేవని, వాటిలో ఒకటి మాత్రమే కనిపిస్తోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అవీ నగర శివారు ప్రాంతాల్లోనే అంటున్నారు. గుణదల కొండపై గతంలో రాబందులు ఉండేవంటున్నారు. ఒకప్పుడు నగరంలో విహ రించే నేత పక్షి, నేడు దివిసీమకే పరిమితమైంది. పక్షిజాతులు అంతరించి జీవవైవిధ్యం దెబ్బతింటున్నట్లు పర్యావరణ నిపుణులు చెపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement