బండి తీయాలంటే భయం | - | Sakshi
Sakshi News home page

బండి తీయాలంటే భయం

May 25 2026 9:45 AM | Updated on May 25 2026 9:45 AM

పెట్రోల్‌, డీజిల్‌ ధరల బాదుడే బాదుడు వరుసగా వారం రోజుల్లో మూడు సార్లు పెరిగిన ఇంధన ధరలు లీటర్‌ పెట్రోల్‌పై రూ. 5.20, డీజిల్‌పై రూ. 5.05 పెంపు లీటర్‌ పెట్రోల్‌ రూ.114.40, డీజిల్‌ రూ.102.13 చేరిక

గాంఽధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): పెట్రోల్‌, డీజిల్‌ ధరల బాదుడుతో సామాన్యుడు బండి తీయా లంటే భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రజల ఆదాయం పెరగకున్నా ఇంధన ధరలు ౖపైపెకి ఎగబాగుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌ రూ.114.40, లీటర్‌ డీజిల్‌ ధర రూ.102.13కు చేరింది. ధరల ప్రభావం నిత్యావసరాలు, వ్యవసాయ, రవాణా రంగంపై తీవ్రంగా ఉంది.

ఎన్టీఆర్‌ జిల్లాలో 186, కృష్ణాలో 175 బంకులు

ఎన్టీఆర్‌ జిల్లాలో పలు కంపెనీల పరిధిలో 186 బంకులు పని చేస్తున్నాయి. వీటితో ప్రతి రోజూ 8 లక్షల లీటర్ల డీజిల్‌, 6 లక్షల లీటర్ల పెట్రోల్‌ సరఫరా అవుతోంది. కృష్ణా జిల్లాలో 175 బంకులు ఉన్నాయి. డీజిల్‌ 3.30 లక్షల లీటర్లు, పెట్రోలు 2.30 లక్షల లీటర్లు విక్రయిస్తున్నారు.

బాదుడుకు తెర తీసింది

ఈ నెల 15న ప్రభుత్వం తొలిసారిగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచింది. ఆ తర్వాత 19న మరోసారి పెంచింది. శనివారం ఉదయం ఇంకోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి బాదుడుకు తెరతీసింది. మూడు విడతల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ. 5.20, లీటర్‌ డీజిల్‌పై రూ. 5.05 వరకు ధర పెరిగింది. ఈ ధరల పెరుగుదల ఇంతటితో ఆగుతుందన్న నమ్మకం లేదని, రాబోయే రోజుల్లోనూ పెరిగే అవకాశం ఉందని బంక్‌ల యాజమాన్యం చెబుతోంది. నెలవారీ ఆదాయం పెరగడం లేదని, ఖర్చులు అధికమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. నెలకు సగటున 30 లీటర్ల పెట్రోల్‌ వినియోగించే సామాన్యుడిపై ధరల పెరుగుదల కారణంగా డైరెక్ట్‌గా రూ. 150 భారం పడుతుంది. మొత్తంగా ధరల పెంపు కారణంగా జిల్లాలో వాహనచోదకులపై ఏటా రూ. 250 కోట్ల పై చిలుకు అదనపు భారం పడుతుంది.

ఆకాశన్నంటుతున్న నిత్యావసరాలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రవాణా రంగంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపడంతో నిత్యావసరల ధరలు పెరిగిపోయాయి. కూరగాయల ధరలు అధికమయ్యాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. చిరు ఉద్యోగులు అవస్థ పడుతున్నారు. ఆదాయంలో అధిక భాగంగా గ్యాస్‌, నిత్యావసరాలు, కూరగాయలకే ఖర్చవుతుందని సామాన్యులు వాపోతున్నారు. ఆటో, మోటారు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనులన్నీ యంత్రాలతోనే చేయాల్సిన పరిస్థితి. ప్రతి పనికి ట్రాక్టర్‌ వినియోగించాల్సి రావడం.. డీజిల్‌ ధర పెరగడంతో పొలాలు దుక్కులు, పంటల సాగుకు సిద్ధం చేసేందుకు అధికంగా పెట్టుబడి అవుతుందని ఆందోళన చెందుతున్నారు. గతేడాది గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి చూశామని, తొలకరి ప్రారంభానికి ముందే డీజిల్‌ ధరలు పెంచితే వ్యవసాయం చేయడం ఎలా అని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ఈ నెల 14వ తేదీ వరకు పెట్రోల్‌ ధర రూ. 109.21 డీజిల్‌ ధర రూ. 97.07 గా ఉంది

తేదీ పెట్రోల్‌ డీజిల్‌

15న 112.50 100.22

19న 113.45 101.17

23న 114.40 102.13

Advertisement
 
Advertisement
Advertisement