గుడివాడటౌన్: కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటకోత్సవాలు ఆదివారం ఎస్‌పీఎస్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో ప్రారంభమయ్యాయి. 26వ తేదీ వరకు నాటకోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 24వ తేదీ మహాపురుషుడు మండలి, 25న కపిరాజు, సహన, 26వ తేదీ అమ్మచెక్కిన బొమ్మ, ఖడ్గ తిక్కన నాటికలు ప్రదర్శిస్తారన్నారు. ఏపీతోపాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణకు చెందిన ప్రముఖ నాటక సంస్థలు ఇందులో పాల్గొంటాయన్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి ప్రదర్శనలు ప్రారంభమవుతాయని తెలిపారు.
గుడివాడ టౌన్: రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీ కమిషనర్ బాబు.ఎ పాలనలో వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు అన్నారు. స్థానిక బస్‌స్టాండ్ సమీపంలోని కోడె ఫంక్షన్ హాలులో ఆదివారం అసోసియేషన్ జిల్లా సభ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ విభజించు – పాలించు విధానం అమలు చేస్తూ ఆయన ఉద్యోగుల మధ్య, సహకార సంఘాల బ్యాంకులకు చెందిన అనేక మంది మేనేజర్‌లు, సూపర్ వైజర్ల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీస్తున్నారని చెప్పారు. పాత కంప్యూటర్లను ఉద్యోగులకు ఇచ్చి డిజిటలైజేషన్ అంటూ ఇబ్బందులపాల్జేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఖాతాల్లో ఎక్కువ వడ్డీ చూపించి వారికి రుణాలు భారంగా ఉండేలా చేస్తున్నారన్నారు. దీంతో రైతులు సహకార సంఘాల ఉద్యోగస్తులను నమ్మే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం జీవో నంబర్ 322ను వెంటనే రద్దు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు హనుమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్.రమేష్‌బాబు, కోశాధికారి నాగరాజు, సుజాత తదితరులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): బక్రీద్ సందర్భంగా జంతువుల అక్రమ రవాణా, వధ వంటి నేరాలను అరికట్టేందుకు పోలీస్‌శాఖ నుంచి నోడల్ అధికారిగా అదనపు డీసీపీ జి. రామకృష్ణను నియమించారు. ఈ మేరకు సీపీ రాజశేఖరబాబు ఆదేశాలు జారీ చేశారు. జంతు పరిరక్షణ చట్టాలను అమలు పరిచే దిశగా హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ తరఫున ఈ నియామకం చేసినట్లు తెలిపారు. నగరంలో ఎక్కడైనా జంతువులపై జరుగుతున్న నేరాలు, హింసపై నోడల్ అధికారి 94904 93192కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ ఆధ్వర్యాన ఆదివారం నగరంలోని రైల్వేస్టేషన్‌లో హైడ్రేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ వర్షా సోనాకియా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వలంటీర్లతో కలసి 1వ నంబర్ ప్లాట్‌ఫాంలో మజ్జిగ పంపిణి చేశారు. ఆమె మాట్లాడుతూ వేసవిలో ప్రయాణికులు, సిబ్బంది డీహెడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉందన్నారు. వారి ఆరోగ్యం దృష్ట్యా రైళ్లలోని ప్రయాణికులు, సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సెక్రటరీ నిహారిక, జాయింట్ సెక్రటరీ జ్ఞానప్రసూన, విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ తదితరులు పాల్గొన్నారు.


