లబ్బీపేట(విజయవాడతూర్పు): వారం రోజులుగా తీవ్రమైన ఎండలతో నిప్పుల కొలిమిలా మారిన నగరం ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో పాటు, ఈదురు గాలులు వీయడంతో ఒక్కసారిగా చల్లపడింది. అప్పటి వరకూ బయటకు రావడానికి సాహసించని నగర ప్రజలు ఒక్కసారిగా ఉపశమనం పొందారు. వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతున్నాయి. పడమటి గాలులు వీయడంతో పలువురు వడదెబ్బకు గురయ్యారు. కొందరు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందగా, మరికొందరు మృత్యువాత పడ్డారు. రాత్రి 10 గంటల వరకూ వేడి గాలులు వీస్తూనే ఉండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు సాహసించలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కురిసిన చిరుజల్లులతో వాతావరణం ఒక్కసారిగా చల్ల బడి ప్రజలకు ఊరట కలిగింది. అయితే ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగాయి. కస్తూరిభాయిపేటలో విద్యుత్ వైర్లు తెగడంతో కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.


