23 కేంద్రాలకు 10,119 మంది కేటాయింపు 60.65 శాతం దాటని హాజరు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని విజయవాడలో 23 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 10,119 మంది అభ్యర్థులను కేటాయించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు, పరీక్ష అబ్జర్వర్లు కాటమనేని భాస్కర్, వాకాటి కరుణ నగరంలోని వివిధ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకూ జరిగింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ అభ్యర్థ్ధులను లోపలకు అనుమతించారు. 10,119 మంది అభ్యర్థులకు ఉదయం పేపర్–1కు 6,137 (60.65 శాతం) మంది, మధ్యాహ్నం పేపర్–2కు 6,073 (60.02 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జేసీ ఇలక్కియపరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అన్ని కేంద్రాల వద్ద వసతులు ఏర్పాటు చేశారు.
సమయం దాటడంతో గేట్ వద్ద యువతి నిలిపివేత
నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభమయ్యే అరగంట ముందుగా గేట్‌లను మూసివేయాలని యూపీఎస్సీ ఆదేశించింది. ఆ ప్రకారం విజయవాడలోని కేబీఎన్ కళాశాల వద్ద అధికారులు సరిగ్గా తొమ్మిది గంటలకు గేట్ మూసివేశారు. కొద్ది సేపటికి గుంటూరుకు చెందిన యువతి గేట్ వద్దకు చేరుకుంది. నిబంధనల ప్రకారం గేట్ తీయడానికి లేదని అధికారులు ప్రకటించారు. దాంతో ఆ యువతి తీవ్ర నిరాశకు గురైంది. అయితే ఆమె గంట ముందుగానే అక్కడకు చేరుకొని కారులో చదువుకుంటూ ఉండిపోయిందని తెలిసింది.


