బైండోవర్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

బైండోవర్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష

May 25 2026 9:45 AM | Updated on May 25 2026 9:45 AM

బైండోవర్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష 10 రోజులుగా మృత్యువుతో పోరాడి కుమారుడు మృతి

గుడివాడరూరల్‌: బైండోవర్‌లో ఉన్న వ్యక్తి మళ్లీ నేరానికి పాల్పడటంతో జైలుకు పంపిన సంఘటన జిల్లాలో తొలిసారి చోటు చేసుకుందని గుడివాడ డీఎస్పీ పాలా శ్రీనివాస్‌ తెలిపారు. స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ కొండపల్లి శ్రీనివాస్‌తో కలసి ఆదివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ స్థానిక వాంబేకాలనీకి చెందిన గొల్లపల్లి పోతురాజు గతంలో పలు నేరాల్లో నిందితుడన్నారు. భవిష్యత్‌లో నేరాలకు పాల్పడకుండా సెక్షన్‌ 129(ఈ) బీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రకారం ఏడాది పాటు బైండోవర్‌ చేశామని చెప్పారు.

444 మందిపై బైండోవర్‌ కేసులు..

పోతురాజు పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఈనెల 15న మళ్లీ నేరానికి పాల్పడటంతో కేసు నమోదు చేసి బైండోవర్‌ నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌(తహసీల్దార్‌)కు నివేదించామన్నారు. ష్యూరిటీ, డబ్బు కట్టలేకపోవడంతో డిటెన్షన్‌ ఉత్తర్వుల జారీ కాగా వన్‌టౌన్‌ సీఐ కొండపల్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారని చెప్పారు. గుడివాడ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఇప్పటి వరకు 444 మంది నిందితులపై బైండోవర్‌ కేసులున్నాయన్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆదేశాల మేరకు పట్టణ ప్రజల శాంతిభద్రలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. బైండోవర్‌లో ఉన్న వ్యక్తులు మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఇది గుణపాఠమని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఈ నెల 13న కారు ప్రమాదంలో తల్లి గంగాభవాని మృతి

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

కిలేశపురం(ఇబ్రహీంపట్నం): కిలేశపురం గ్రామంలో ఈనెల 13న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుంటుపల్లి వెంకట జితేంద్ర (22) చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఈనెల 13న తన తల్లి గుంటుపల్లి గంగాభవానీతో కలిసి ఇంటికొచ్చిన బంధువులకు శుభశకునం కోరుతూ కారుకు ఎదురొచ్చిన సమయంలో మరో కారు ప్రమాదంలో తల్లి ఆరోజే మృత్యువాత పడగా కుమారుడు వెంకట జితేంద్ర తీవ్రమైన గాయాలతో చికిత్స కోసం వైద్యశాలలో చేర్చారు. 10 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచాడు. పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం యువకుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 10 రోజుల వ్యవధిలో తల్లి కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బీటెక్‌ చదువుతున్న కుమారుడు ప్రయోజకుడై కుటుంబానికి బాసటగా నిలుస్తారనే తండ్రి రమేష్‌ ఆశించిన తరుణంలో భార్యతో పాటు కుమారుడిని కోల్పోవడంతో అతనిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. శోకసంద్రంలో నిండిన ఆ కుటుంబం గ్రామస్తులతో కలసి అశ్రునయనాలతో వెంకట జితేంద్ర మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement