గుణదల కొండకు పోటెత్తిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

గుణదల కొండకు పోటెత్తిన భక్తజనం

May 25 2026 9:45 AM | Updated on May 25 2026 9:45 AM

గుణదల కొండకు పోటెత్తిన భక్తజనం

భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..

గుణదల(విజయవాడ తూర్పు): వేసవి సెలవుల నేపథ్యంలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తజనం పోటెత్తారు. ఓ వైపు భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా 43 డిగ్రీల ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా యాత్రికులు తమ భక్తి ప్రపత్తులను చాటుతున్నారు. క్రైస్తవ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి యాత్రికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. కాలినడకన కొండ శిఖరాగ్రానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

సాధారణ రోజుల్లో..

దేశంలో రెండో అతి పెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన గుణదల ఆలయంలో ప్రతీ రోజు భక్తులు వేలాదిగా వస్తుంటారు. కొండ ఎగువన ఉన్న మరియమాతను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. కొబ్బరికాయలు కొట్టడం, చెట్లకు ఉయ్యాలలు కట్టడం, కొవ్వొత్తులు వెలిగించడం, పసిపిల్లలకు నామకరణాలు వంటి కార్యక్రమాలు ప్రతి నిత్యం జరుగుతుంటాయి. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం పుణ్యక్షేత్ర గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. ప్రధానాలయంలో సైతం సమష్టి దివ్యబలి పూజలు, దివ్య సత్ప్రసాద ఆరాధనలు జరుగుతుంటాయి. పుణ్యక్షేత్రానికి వచ్చిన యాత్రికులంతా తప్పని సరిగా కొండ శిఖరాగ్రానికి చేరుకుని అక్కడ ఉన్న ఏసుక్రీస్తు శిలువను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో జరిగే మేరీమాత ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.

వేసవి సెలవుల కారణంగా..

విద్యార్థులకు పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం సెలవులు ఉన్న కారణంగా సుదూర ప్రాంతాల నుంచీ యాత్రికులు గుణదల పుణ్యక్షేత్రానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు దినాల్లో భక్తుల సంఖ్య మరింత గణనీయంగా పెరుగుతుంది. సాధారణ రోజుల్లో, వాతావరణం అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో యాత్రికుల రాకపోకలు చెప్పుకోదగిన విధంగా ఉంటాయి. కానీ ఈ ఏడాది ఎండలు మండిపోతున్న క్రమంలో ప్రజలు వేసవి తాపానికి ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ గదులకే పరిమితమై ఎండ తీవ్రత నుంచీ తమను తాము రక్షించుకుంటున్నారు. ఈ పరిస్థితులలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి రికార్డు స్థాయిలో యాత్రికులు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మండుటెండల్లో సైతం గుణదల కొండకు భక్తులు పోటెత్తుతున్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణ..

వేసవి తీవ్రతకు భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయ పరిసరాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పుణ్యక్షేత్ర ప్రాంగణాలన్నింటితో పాటు కొండ ఎగువ ప్రాంతాలలో సైతం తాగునీటి వసతి కల్పించారు. ఎండ తీవ్రతకు అనారోగ్యానికి గురికాకుండా యాత్రికుల కోసం పుణ్యక్షేత్ర ఆవరణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.

వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీ

మండుటెండను సైతం

లెక్కచేయని భక్తులు

కొండ శిఖరాగ్రాన ప్రత్యేక ప్రార్థనలు

వేసవి సెలవుల కారణంగా గత నెల రోజులుగా గుణదల మేరీమాత ఫుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారాలు, సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య మరింతగా ఎక్కువగా ఉంది. ఎండలను దృష్టిలో ఉంచుకుని పుణ్యక్షేత్రానికి చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. తాగునీరు, చలువ పందిళ్లు సిద్ధం చేశాం. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నాం.

– యేలేటి విలియం జయరాజు, పుణ్యక్షేత్ర రెక్టర్‌ ఫాదర్‌

Advertisement
 
Advertisement
Advertisement