పెనమలూరు: పోరంకి శ్రీనగర్‌కాలనీలో ఉన్న శ్రీకోదండరామాలయం ట్రస్ట్ కార్యదర్శి చక్రహరి కనకరాజు(75) విద్యుదాఘాతానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 19న కనకరాజు ఇంటి వద్ద భవన నిర్మాణ కార్మికుడు వెంకటశివరామ్ ఇనుప రాడ్లను భవనం పై అంతస్తుకు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు ఇనుప రాడ్లు తగిలాయి. వెంటనే అతను రాడ్లు వదిలేయటంతో కింద ఉన్న కనకరాజుపై పడ్డాయి. ఈ ఘటనలో కనకరాజు విద్యుదాఘాతానికి గురై ఒళ్లు కాలి గాయపడ్డారు. ఆయనను వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకై తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. కనకరాజు పోరంకి శ్రీనగర్‌కాలనీలో కోదండ రామాలయం నిర్మాణంలో విశేష కృషి చేశారు. అదే విధంగా రామాలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కనకరాజు మృతికి ట్రస్ట్ సభ్యులు, స్థానికులు ప్రగాఢ సంతాపం తెలిపి నివాళులర్పించారు.
కంకిపాడు: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని తెన్నేరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాలు, పోలీసుల కథనం మేరకు.. కై కలూరు మండలం ఇంజరం ప్రాంతానికి చెందిన జొన్నాదుల మేరీ(33), వినోద్‌తో కలిసి తెన్నేరులో ఇటుక బట్టీల వద్ద పనిచేసేందుకు 10 రోజుల క్రితం వచ్చింది. ఆదివారం మేరీ ఇటుక బట్టీల వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
హత్యా.. ఆత్మహత్యా..
మేరీ మృతిపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మేరీ కలిసి ఉంటున్న వ్యక్తి వినోద్ ఎవరు, అతని నేపథ్యం ఏంటి? అనే కోణంతో పాటుగా ఆత్మహత్యకు పాల్పడిందా, లేదా హత్యకు గురైందా ?, అయితే అందుకు గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కంకిపాడు సీఐ జె.మురళీకృష్ణ, ఎస్‌ఐ సందీప్ సమాచారం సేకరిస్తున్నారు.
హనుమాన్‌జంక్షన్‌రూరల్: బాపులపాడు మండలం కోడూరుపాడులో నిర్వహిస్తున్న మట్టి అక్రమ తవ్వకాల్లో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని రాళ్లకుంట చెరువు నుంచి మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అతి వేగంతో నడపటంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ చందు వరుణ్(21) తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాక్టర్ నుంచి కింద పడిన వరుణ్ కాలు విరగటంతో చికిత్స నిమిత్తం హుటాహుటినా విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసుకున్న వరుణ్ తన తండ్రికి చేదోడువాదోడుగా ఉండేందుకు ట్రాక్టర్ నడుపుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.


