మధురానగర్(విజయవాడసెంట్రల్): రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల 25 వసంతాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆదివారం సత్యనారాయణపురం రైల్వే కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిగాయి. దేశ విదేశాలలో వివిధ హోదాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సేవా రంగాలలో స్థిరపడిన 2000–2001 బ్యాచ్ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకుని తమ అనుభవాలను పంచుకున్నారు. 25 సంవత్సరాల తరువాత కలుసుకోవటంతో ఒకింత ఆనందం, ఉద్వేగానికి లోనయ్యారు. విద్యార్థి దశలో కలిసి చదివిన స్నేహితులు పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పూర్వ విద్యార్థులు సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. విద్యార్థి దశలో ఏర్పడిన స్నేహబంధాలు జీవితాంతం నిలిచిపోతాయని పేర్కొన్నారు. కాలం మారినా అనుబంధాలు మారవని, ఇలాంటి కలయికలు మానసిక ఆనందాన్ని నూతన ఉత్తేజం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటపాటలు ఉత్సాహంగా జరిగాయి. 25 వసంతాల స్నేహబంధాన్ని గుర్తు చేసుకుంటూ సిల్వర్ జూబ్లీ కేక్ కట్ చేసి మిఠాయిలు, జ్ఞాపికలు పంపిణీ చేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించిన పూర్వ విద్యార్థులు డాక్టర్ నోవా సందీప్, లక్ష్మీకాంత్, రాజేంద్ర, ధరన్, సాయి శివలను అభినందించారు.


