లబ్బీపేట(విజయవాడతూర్పు): వేసవి తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వడడ్పులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. కూలీ పనులకు వెళ్లి కొందరు, యాచకులు మరికొందరు, అత్యవసర పనులపై తిరిగే ఇంకొందరు వడగాడ్పుల ప్రభావంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు రోజుల్లో దాదాపు 28 మంది మృతికి వడదెబ్బ కారణంగా భావిస్తున్నారు. శనివారం విజయవాడ నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురిని ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీకి తీసుకురాగా, అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. విజయవాడ వన్‌టౌన్‌లో ఒకరు, సత్యనారాయణపురంలో ఒకరు, బస్టాండ్‌లో మరో ఇద్దరు, ఇబ్రహీంపట్నంలో ఒకరు, గంపలగూడెం మండలం గాదెవారిగూడెంలో ఒకరు, గంపలగూడెం పడమట దళితవాడలో ఒకరు మృతిచెందారు. శుక్రవారం సైతం వడ గాడ్పుమరో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 మంది మృత్యువాత పడ్డారు. విజయవాడ నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను సైతం పోలీసులు మార్చురీకి తరలిస్తున్నారు. వీటిని పోస్టుమార్టం నివేదిక అనంతరమే వడదెబ్బ మరణాలుగా నిర్ధారిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
రెండు రోజుల్లో 30 మంది వరకూ...
ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల్లో 30 మంది వరకూ వడదెబ్బతో మృత్యువాడ పడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే తొమ్మిది మంది ఉన్నారు. వారిలో సత్యనారాణపురం స్టేషన్ పరిధిలో శనివారం ఒకరు మృతి చెందగా, శుక్రవారం సీతారామపురం, కస్తూరి భాయిపేట, రాఘవయ్యపార్కు, బీసెంటు రోడ్డు, ఎల్‌ఐసీ భవనం, సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. ఇబ్రహీంపట్నం మండలం కేతన కొండలో 32 ఏళ్ల పఠాన్ నాగుల్‌మీరా కూలి పనులకు వెళ్లి వడదెబ్బకు గురై మృత్యువాడ పడ్డాడు. విజయవాడ తూర్పులో రెండు రోజుల్లో గుణదలలో 44 ఏళ్ల శరత్‌బాబుతో పాటు, ప్రభుత్వాస్పత్రి వద్ద 60 ఏళ్ల వృద్ధురాలు మృత్యువాత పడింది. వారితో పాటు శనివారం ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీకి వచ్చిన మరో ముగ్గురు మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు. విజయవాడ పశ్చిమలో శుక్రవారం ముగ్గురు, శనివారం ఒకరు మృత్యువాత పడ్డారు. కృష్ణాజిల్లాలో పెనమలూరు, పెడన, గుడివాడ, వేకనూరు, తోట్లవల్లూరు, మోపిదేవిలో ఒక్కో మరణం నమోదైంది. ఇలా మొత్తం ఉమ్మడి కృష్ణాలో ఇప్పటి వరకూ 30 మంది వరకూ ఎండల తీవ్రతతో మరణించారు.
ఉమ్మడి జిల్లాలో శనివారం కూడా వడగాడ్పులు కొనసాగాయి. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా నందిగామలో 44.6 డిగ్రీలు, కంచికచర్లలో 44.3, రెడ్డిగూడెంలో 43.6, జగ్గయ్యపేటలో 43.7, విజయ వాడలో 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో సైతం 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. విజయవాడ నగరంలో మధ్యాహ్నం నుంచి వడ గాడ్పుల ప్రభావం పెరిగింది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


