మచిలీపట్నంఅర్బన్: పిల్లల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసిన ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు జిల్లాలో వివాదాస్పదంగా మారుతున్నాయి. ఉచితం అంటూ ఆన్‌లైన్‌లో నమోదు చేపట్టి, అనంతరం వివిధ పేర్లతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. మచిలీపట్నం ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న షటిల్, స్కేటింగ్, క్రీడా ప్రాధికారిక సంస్థ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈత కొలను ఉచిత శిక్షణ శిబిరాలపై చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉచిత శిక్షణ పేరుతో వసూళ్లపై ఇండోర్ స్టేడియం వద్ద పిల్లల తల్లిదండ్రులు శుక్రవారం నిరసన వ్యక్తంచేశారు.
చిన్నారుల నుంచి వసూళ్లు..
జిల్లా వ్యాప్తంగా సుమారు 1200 మంది విద్యార్థులు సమ్మర్ క్యాంప్ కోసం ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే శిక్షణ ప్రారంభమైన తర్వాత ఫీజుల పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మే 5 నుంచి ప్రారంభమైన స్కేటింగ్ శిక్షణకు సుమారు 90 మంది పిల్లలు హాజరవుతుండగా, ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేల వరకు ఫీజు, అదనంగా స్కేటింగ్ బూట్ల కోసం రూ.1700 చొప్పున వసూలు చేసినట్లు తల్లిదండ్రు లు చెబుతున్నారు. ఈ మొత్తాలను ప్రభుత్వ సంస్థ ఖాతాలకు కాకుండా వ్యక్తిగత మొబైల్ నంబర్లకు గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా జమ చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు.
రసీదులు లేవు...లెక్కలు లేవు
ఇక్కడ తీసుకున్న డబ్బులకు ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వసూలు చేస్తున్న డబ్బులు నిజంగా ప్రభుత్వ ఖాతాలకు వెళ్తున్నాయా? లేక వ్యక్తుల చేతుల్లోకే చేరుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక తల్లి తన కుమారుడిని స్కేటింగ్ శిక్షణకు చేర్పించేందుకు వెళ్లగా, సిబ్బంది ఇచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రూ.1000 చెల్లించారు. తర్వాత అది కోచ్ వ్యక్తిగత ఖాతా అని తెలుసుకుని అధికారులను ప్రశ్నించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నిరసన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు


