ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు నంద్యాలకు చెందిన భక్తులు సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు పచ్చల హారాన్ని కానుకగా సమర్పించారు. నంద్యాల నందిపల్లికి చెందిన వి.ఉదయ భాస్కర్‌రెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణను కలిసి సుమారు రూ.2 లక్షలు వెచ్చించి 22 గ్రాముల బంగారం, పచ్చ రాళ్లతో తయారు చేయించిన హారాన్ని అమ్మవారికి సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్, అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
గుడివాడ టౌన్: స్థానిక వాసవిచౌక్ లో ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కిరీట వివాదానికి శుక్రవారం తెర పడింది. తాకట్టు పెట్టిన కిరీటాన్ని ట్రస్ట్ సభ్యులు విడిపించి ఆలయానికి అందజేశారు. శనివారం సంప్రోక్షణ చేసిన అనంతరం స్వామి వారికి అలంకరింపచేస్తామని చైర్మన్ పోకూరి మోహనరావు అన్నారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ కల్యాణమండపం నిర్మాణం ఆగిపోయిందని, అందు కోసం దీనిని కుదువ ఉంచాల్సి వచ్చిందన్నారు. ఆలయానికి సంబంధించి ధూప, దీప నైవేద్యాల నుంచి అన్ని ఖర్చులు కల్యాణ మండపం భరిస్తూ వచ్చిందని, ట్రస్ట్ సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో తాకట్టు పెట్టామని ఆయన వివరించారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న చర్లపల్లి–భువనేశ్వర్ న్యూ రైలును రెగ్యులర్ వారాంతపు రైలును నడిపేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. చర్లపల్లి–భువనేశ్వర్ న్యూ (17067) రైలు ఈ నెల 25 నుంచి ప్రతి సోమవారం, అదే విధంగా భువనేశ్వర్ న్యూ– చర్లపల్లి (17068) రైలు ఈ నెల 26 నుంచి ప్రతి మంగళవారం నడవనున్నాయి. ఈ రెండు మార్గాలలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపూర్, ఖుర్ధారోడ్డు, భువనేశ్వర్ స్టేషన్‌లలో ఆగుతుంది.


