కై లే కృతజ్ఞతలు..
● గ్రామ పంచాయతీ అనుమతి లేనిదే
చెరువుల్లో మట్టి తవ్వకాలు నిషిద్ధం
● నిబంధనలు అతిక్రమిస్తే
పోలీసు కేసులు నమోదు చేయాలి
● ఎస్పీతో కలిసి కలెక్టర్
వీడియో కాన్ఫరెన్స్
● పామర్రు, పెడన, గుడివాడల్లో
ఆగిన మట్టి తవ్వకాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అక్రమ మట్టి తవ్వకాలపై కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కన్నెర్ర చేశారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ చెరువుల్లో అనుమతి లేనిదే తవ్వకాలు జరపరాదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే పోలీసు కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘చెరువుల్లో తోడేళ్లు..!’ అనే కథనంపై ఆయన స్పందించారు. ఎస్పీ విద్యాసాగర్‌తో కలిసి ఆయన బుధవారం సంబంధిత అధికారులు డీపీఓ ధనలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రమణారావు, డీఎస్పీలు, ఎంపీడీవోలు, పంచా యతీ కార్యదర్శులతో గ్రామ పంచాయతీ చెరువుల్లో అక్రమ తవ్వకాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువుల్లో పూడిక మట్టిని చెరువు కట్ట పటిష్టతకు ఉపయోగించాలని, మిగిలింది ఏమైనా ఉంటే వేలం వేయాలన్నారు. వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని చెప్పారు. ఇటువంటి పద్ధతులను అనుసరించకుండా ఇటీవల కొందరు రాత్రి వేళల్లో గ్రామ పంచాయతీ చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయన్నారు. ఇది సరికాదని స్పష్టం చేస్తూ ఇకపై అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి తవ్వకాలు జరిపితే అందుకు బాధ్యులైన వారిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి కేసు నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ చెరువుల్లో చెరువు తవ్వకం జరపాలంటే తప్పనిసరిగా గ్రామ పంచాయతీ అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ లేఅవుట్‌లకు మట్టి కావలసి వస్తే దానికి కూడా అనుమతి తప్పనిసరి అని చెప్పారు. దీంతో పామర్రు, పెడన, గుడివాడలో విచ్చల విడిగా సాగుతున్న అక్రమాలకు తెరపడింది.
అక్రమ మట్టి తవ్వకాలపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించి తవ్వకాలను నిలిపి వేసి నందుకు కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్‌లకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కైలే అనిల్‌కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అవసరాలు, కమ్యూనిటీ అవసరాలకు మట్టి తవ్వకాలు చేసుకున్నా అభ్యంతరం లేదని, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వ్యాపార ధోరణిలో అక్రమ మట్టి తవ్వకాలు జరిపి కోట్లు ఆర్జిస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా అక్రమ మట్టి తవ్వకాలు జరగకుండా గట్టి నిఘా కొనసాగించాలని కై లే కోరారు.


