కంచికచర్ల: బ్రేక్ డౌన్ అయిన క్రేన్‌కు మరమ్మతులు చేస్తుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ బలంగా ఢీ కొనటంతో క్రేన్ మెకానిక్ మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం కంచికచర్ల మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ పి.విశ్వనాధ్ కథనం మేరకు... తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాకు చెందిన ఉత్కం స్వామి (61) హైడ్రాలిక్ క్రేన్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. విజయవాడ వైపునకు వెళ్తున్న ఓ క్రేన్ మరమత్తులకు గురయి ఈ నెల 21 రాత్రి వేళ మండలంలోని కీసర సమీపంలోని ఇన్వెంటా కెమికల్స్ కర్మాగారం వద్ద సమయంలో ఆగిపోయింది. మెకానిక్ ఉత్కం స్వామి వచ్చి రోడ్డు పక్కన క్రేన్‌కు మరమ్మతు పనులు చేస్తుండగా హైదకాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లుతున్న ఓ లారీ వేగంగా వచ్చి బలంగా స్వామిని ఢీకొంది. ఈ ఘటనలో స్వామి తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని బాదితుడిని వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు స్వామి కుమారుడు ఉత్కం మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


