పెనుగంచిప్రోలు: పచ్చడి మామిడి కాయల ధరలు, పచ్చడి తయారీ ముడి సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆవకాయ పచ్చడి జాడీలోకి చేరే పరిస్థితులు కనపడటం లేదు. ధనిక, పేద అనే వ్యత్యాసాలు లేకుండా మామిడి కాయ పచ్చడి పెట్టే ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా తెలుగువారు ఏటా ఈ సీజన్‌లో మామిడి కాయ పచ్చడి పెట్టే సంప్రదాయం ఉంది. ఆవకాయ రుచి చూస్తే గుర్తు వచ్చేది ఆంధ్రులే. ఈ పచ్చడి తయారు చేసే సమయంలో నియమ నిష్టలతో చేయక పోతే నిల్వ ఉండదనే నానుడి కూడా ఉంది. గతంలో ఒకొక్క కుటుంబం 100 నుంచి 200 కాయలు వరకు పచ్చళ్లు పెట్టేవారు. రానురాను అది 50 నుంచి 25 కాయలకు పరిమితమైంది. అయితే ప్రస్తుతం పది కాయలు పెడితే చాలని ప్రజలు అనుకుంటున్నారు.
తెగుళ్ల బెడద...
ఈఏడాది మామిడి సీజన్ ప్రారంభంలో తేనెమంచు పురుగు ఆశించి పూత రాలి పోయింది. కొన్ని చెట్లకు పలుచగా కాయలు కాసినా వాటికి మంగు రావటంతో పాటు పలు రకాల తెగుళ్లు ఆశించటం, గాలివానకు కాయ రాలింది. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. గతంలో చిన్న రసం, పెద్ద రసం కాయలు చెట్టుకు 1000కి పైగా కాసేవి. ఈ ఏడాది ప్రతాకూల పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చెట్లు కాయకపోగా మరికొన్ని చెట్లకు పలుచగా ఉన్నాయి. మంగు వచ్చిన మామిడి కాయలు పచ్చడికి పనికి రాకుండా పోవటంతో ఉన్న కొద్దిపాటి కాయలకు డిమాండ్ పెరిగింది.
పెరిగిన కాయల, సరుకుల ధరలు
మామిడి కాయ పచ్చడి పెట్టే కాయల ధరలు కూడా డిమాండ్ కారణంగా బాగాపెరిగాయి. చిన్న రసాలు కాయ ఒకటికి రూ.20, పెద్ద రసాలు రూ.30, తెల్ల గులాబీ రూ.30, నాటుకాయలు ఒకటికి రూ.15 పలుకుతున్నాయి. ఇక కిలో వేరు శనగ నూనె రూ.185, ఎండు మిరపకాయలు రూ.250 నుంచి రూ.300, ఆవాలు రూ.200, మెంతులు రూ.130, వెల్లుల్లి రూ.220, ఉప్పు కిలో రూ.20 చొప్పున పలుకుతున్నాయి. పెరిగిన ధరలతో పచ్చడి మానుకుంటేనే బాగుంటుందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు అనుకుంటున్నారు.
పెరిగిన ధరలు ప్రకారం ఓఇంటికి అవసరమైన ఆవకాయ పచ్చడి పెట్టాలంటే రూ.3 వేల వరకు ఖర్చు అవుతుంది. గతంతో పోలిస్తే రెట్టింపు ఖర్చు అవుతోందని వినియోగదారు అంటున్నారు. అటు మామిడి కాయలు, ఇటు సరుకుల ధరలు మండుతుండటంతో ఈసీజన్‌లో మామిడి పచ్చడికి చాలామంది దూరంగా ఉంటున్నారు.
భారంగా మారిన ఆవకాయ పచ్చడి తయారీ మండుతున్న పచ్చడి ముడి సరుకుల ధరలు మార్కెట్‌లో అరకొరగానే మామిడి కాయలు
పచ్చడి పెట్టే పరిస్థితి లేదు
పెరగిన మామిడికాయలు, దినుసుల ధరలతో ఈఏడాది పచ్చడి పెట్టే పరిస్థితి లేదు. గతంలో 50 కాయలు పచ్చడి పెట్టే వాళ్లం. అయితే పచ్చడి లేదనిపించుకోకుండా 10 కాయలు పచ్చడి పెడదామని అనుకుంటున్నాం. బంధువులు వచ్చినా ఆవకాయ రుచి చూపించే పరిస్థితి లేకుండా పోతోంది.
– డి.మహాలక్ష్మి, గృహిణి, పెనుగంచిప్రోలు


