రద్దీ నేపఽథ్యంలో అంతరాలయ దర్శనం రద్దు సర్వ దర్శనానికి రెండు గంటల సమయం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, శుక్రవారం నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజామున నుంచి ప్రారంభమైన రద్దీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు కొనసాగింది. రద్దీ నేపఽథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు నిలిపివేశారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వేసవి సెలవులు మరికొద్ది రోజుల్లో ముగియనుండటం, నూతనంగా కళాశాలలు, విద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన వారు అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. తెల్లవారుజామునే పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి కొండపైకి చేరుకుంటున్నారు. ఘాట్‌రోడ్డుతో పాటు మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకుని సర్వ దర్శనం, రూ.100, రూ.300 టికెట్ క్యూలైన్ల ద్వారా ఆలయానికి చేరుకుంటున్నారు. ఉదయం 9 గంటల కల్లా అన్ని క్యూలైన్లు భక్తులతో నిండటంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. రూ. 300 టికెటు కొనుగోలు చేసిన భక్తులతో పాటు వీఐపీ, సిఫార్సు లేఖలపై విచ్చేసిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు.
మధ్యాహ్నం వేళ సాధారణ రద్దీ..
ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మధ్యాహ్నం వేళ రద్దీ సాధారణంగా కనిపించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తుల తాకిడి కనిపించగా, రెండు గంటల నుంచి అన్ని క్యూలైన్లు ఖాళీగా కనిపించాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి భక్తుల రద్దీ తిరిగి ప్రారంభమై 9.30 గంటల వరకు కొనసాగింది.


