పటమటలో కార్ల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

పటమటలో కార్ల బీభత్సం

May 22 2026 5:34 AM | Updated on May 22 2026 5:34 AM

పటమటలో కార్ల బీభత్సం

యువతి కోసం స్నేహితుల మధ్య వివాదం

పటమట(విజయవాడతూర్పు): ఓ యువతి కోసం ఇద్దరు స్నేహితులు మధ్య రగిలిన వివాదం సినీ ఫక్కీ లో ఒకరిపై ఒకరు కార్లతో ఢీకొనే వరకు వెళ్లింది. విజయవాడ పటమట హెచ్‌టీ (హై టెన్షన్‌)లైన్‌ రోడ్డులో రెండు మహేంద్ర థార్‌ వాహనాలు ఢీకొట్టుకుని యువకులు వీధి కొట్లాటకు దిగటంతో స్థానికులు భయాందోళనకు గురికావాల్సి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నగరానికి చెందిన బొల్లా ఓం (20), లింగమనేని రోహిత్‌ (19) ఇద్దరు చిన్ననాటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్న స్నేహితులు. వీరిరువురి మధ్య ఓ యువతి వ్యవహారంలో గురువారం సాయంత్రం వివాదం తలెత్తింది. లబ్బీపేటలో మొదలైన ఈ వివాదం ఒకరిపై మరొకరు చాలెంజ్‌ చేసుకుని పటమట హెచ్‌టీలైన్‌ రోడ్డుకు చేరింది. రాత్రి 9 గంటల సమయంలో ఇరువురు ఎదురెదురుగా వారి కార్లతో ఢీకొట్టుకోగా రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. అనంతరం ఇరువురూ కార్లలో ఉన్న ఇనుప రాడ్లను తీసుకుని కార్లపై దాడి చేసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈరోడ్డులో ఒక్కసారిగా భీకరమైన శబ్దాలు రావటం, యువకులు దాడులు చేసుకోవటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో బొల్లా ఓంను పోలీసులు అదుపులోకి తీసుకోగా రోహిత్‌ పరారీలో ఉన్నాడు. ఓం తండ్రి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారని, రోహిత్‌ తండి ఓ ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement