వేద పరిరక్షణ ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం | - | Sakshi
Sakshi News home page

వేద పరిరక్షణ ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం

May 21 2026 10:01 AM | Updated on May 21 2026 10:01 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలోని వేద పరిరక్షణ ట్రస్ట్‌కు హైదరాబాద్‌కు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌ ఈసీఐఎల్‌కు చెందిన వేదాంతం షణ్ముఖ రామకృష్ణ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారిని కలిసి వేద పరిరక్షణ ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

అక్రమ మద్యం కేసులో రిమాండ్‌ పొడిగింపు

విజయవాడలీగల్‌: అక్రమ మద్యం కేసులో నిందితుల రిమాండ్‌ బుధవారం ముగియడంతో గుంటూరు జైలులో రిమాండ్‌లో వున్న ప్రణోయ్‌ప్రకాష్‌ను పోలీసులు సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ప్రణోయ్‌ప్రకాష్‌ రిమాండ్‌ను వచ్చే నెల 3వ తేదీవరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. అనంతరం ప్రణోయ్‌ ప్రకాష్‌ను గుంటూరు జైలుకు తరలించారు. బెయిల్‌పై ఉన్న నిందితుల్లో వాసుదేవరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వెంకటేష్‌నాయుడు, బాలాజీ కుమార్‌యాదవ్‌, నవీన్‌కృష్ణ న్యాయస్థానంలో హాజరుకాగా, మిగతా నిందితులు న్యాయస్థానంలో హాజరుకాలేక న్యాయవాదుల ద్వారా గైర్హాజరు పిటిషన్లు దాఖలు చేశారు.

శాంతి మధ్యంతర బెయిల్‌పై విచారణ పూర్తి

అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై నమోదైన కేసులో విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో వున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమీషనర్‌ కె.శాంతికి మధ్యంతర బెయిల్‌ కోరుతూ న్యాయవాది గోలి నరసింహారావు పిటీషన్‌ దాఖలు చేశారు. పిటీషన్‌పై బుధవారం న్యాయస్ధానంలో వాదనలు వినిపిస్తూ శాంతి కుమార్తెకు ఊటీలో 6వ తరగతి చేర్పించేందుకు ఈనెల 23 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు పూర్తవ్వడంతో ఇన్‌చార్జి సీబీఐ న్యాయమూర్తి తీర్పును గురువారానికి వాయిదా వేశారు.

అభినయ్‌ దర్శన్‌పై

కఠినచర్యలు తీసుకోవాలి

పటమట(విజయవాడతూర్పు): క్రైస్తవ ప్రచారకుడి ముసుగులో తనపై దాడి, హత్యాయత్నం జరిగిందంటూ ఫేక్‌ డ్రామాపై రక్తికట్టిస్తున్న పాస్టర్‌ అభినయ్‌ దర్శన్‌పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ క్రిస్టియన్‌ లీడర్స్‌ ఫోరం (ఏపీసీఎల్‌ఎఫ్‌) స్టేట్‌ ప్రెసిడెంట్‌ ఆలివర్‌ రాయ్‌ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పాస్టర్‌ అభినయ్‌ దర్శన్‌ క్రైస్తవ సమాజానికి తలవంపు తెచ్చే కట్టు కథలకు స్వస్తి పలకాలని, ఆయన చేస్తున్న తప్పుడు కథలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాస్టర్‌ అభినయ్‌ మే 18న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం, నిరుతోటపాలెం గ్రామంలో మతోన్మాదులు తనపై హత్యాయత్నం చేశారని ఫేక్‌ డ్రామా సృష్టించారని విమర్శించారు. తన అనుచరులతోనే దాడి చేయించుకొని కట్టుకథలు అల్లుతున్నాడని, పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి పాస్టర్‌ దర్శన్‌ అనుచరులను ప్రశ్నించటంలో అసలు కట్టు కథ బట్టబయలయిందన్నారు.

రక్షణ కరువైన శిక్షణ

నాగాయలంక: నాగాయలంకలోని కృష్ణానది తీరంలో రాష్ట్రప్రభుత్వ జలక్రీడల శిక్షణ అకాడమీ (వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ) ఆధ్వర్యంలో ఈనెల 1వతేదీ నుంచి బాలలతో వేసవి జల క్రీడల శిక్షణ సందడిగా కొనసాగుతోంది. గ్రామానికి చెందిన నాయుడు గాయత్రి, కన్నా కుమార్‌, మరి కొందరు క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించి ఇక్కడి వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి కీర్తి తెచ్చారు. ఈ ఏడాది సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌–2026 ఈనెల 31వరకు కొనసాగుతుందని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(శాప్‌) అధికారులు చెప్పారు. వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ కింద శాప్‌ నేతృత్వంలో ఎంపిక చేసిన 50 మంది బాలలకు గ్రామానికి చెందిన జాతీయ జల క్రీడాకారులు నాగిడి గాయత్రి, కన్నా కుమార్‌ శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 6 నుంచి గం.8.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఎవరూ నమోదు చేసుకోకపోవడంతో శిక్షణ కేవలం స్థానిక బాలలకే పరిమితమైంది.

రక్షణ చర్యలు ఏవీ...

వేసవి శిక్షణ అయితే ఇస్తున్నారు కానీ బాలలకు సరైన రక్షణ చర్యలను ప్రభుత్వ అధికారులు సమకూర్చలేదు. లైఫ్‌ జాకెట్లు కనిపించలేదు సరికదా బాలలు ఫిట్‌నెస్‌ వ్యాయామాలు చేసేందుకు క్రీడాశాఖ కనీస మ్యాట్‌లు కూడా ఇవ్వకపోవడంతో చిన్నారులు ఘాట్‌లోని రాతి నేలపైనే వ్యాయామ శిక్షణ పొందాల్సి వస్తోంది. ఈ విషయమై వివరణ కోరగా జిల్లా క్రీడా సంస్థ అధికారి ఝాన్సీ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో పిల్లలు నమోదు చేసుకోలేక పోతున్నారని అన్నారు. పిల్లలకు చిక్కీలు ఇస్తున్నామని చెప్పారు. చిన్న చిన్న ఆట వస్తువులు సమకూర్చామని, అవి నాగాయలంకకు పంపించాల్సి ఉందని, తనకు ఆరోగ్యం బాగుండక వెళ్లలేక పోయానన్నారు. నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఉందనేది వాస్తవమేనని అంగీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement