47 మందికి రూ.4.75 లక్షలు జరిమానా | - | Sakshi
Sakshi News home page

47 మందికి రూ.4.75 లక్షలు జరిమానా

May 21 2026 10:01 AM | Updated on May 21 2026 10:01 AM

మద్యం తాగి వాహనాలు నడిపిన

10 మందికి జైలు శిక్ష

కృష్ణలంక(విజయవాడతూర్పు): మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 10 మంది వాహనదారులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ట్రాఫిక్‌ డీసీపీ షిరీన్‌ బేగం పర్యవేక్షణలో నగరంలోని రెండు, మూడు, ఐదు, ఆరో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంగా 57 మంది మద్యం తాగి వాహనాలు నడిపిన వాహన చోదకులను గుర్తించి సంబంధిత న్యాయస్థానాలలో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తులు వారిలో 10మందికి ఒక్కొక్కరికి రెండు రోజులు చొప్పున జైలు శిక్ష, 47 మందికి రూ.4.75 లక్షలు జరిమానా విధించారన్నారు. ప్రతి రోజు ప్రత్యేక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కార్యక్రమాలు నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తామని సీపీ తెలిపారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో నలుగురికి జరిమానా

చిలకలపూడి(మచిలీపట్నం): మద్యం తాగి వాహనాలను నడిపిన నలుగురు వ్యక్తులకు జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్‌ భూపతి శ్రీనివాసరావు బుధవారం తీర్పు చెప్పారు. మచిలీపట్నం నగరంలోని రాబర్ట్‌సన్‌ పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలో నలుగురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు ధ్రువీకరించారు. వారిని బుధవారం ఉదయం కోర్టుకు హాజరుపరచగా, న్యాయమూర్తి విచారణ చేసి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా విధించారు.

అన్ని వర్గాల అభ్యున్నతే మోదీ ప్రభుత్వ లక్ష్యం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్‌వీ మాధవ్‌

పెనుగంచిప్రోలు: అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్‌వీ మాధవ్‌ అన్నారు. స్థానిక మునేరు అవతల కంఠంనేని గార్డెన్స్‌లో పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్‌ ఎన్టీఆర్‌ జిల్లా రెండు రోజుల శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో మాధవ్‌ మాట్లాడుతూ దేశం ముందు.. పార్టీ తరువాత.. వ్యక్తిగతం చివర అనే సిద్ధాంతంతో బీజేపీ పనిచేస్తుందన్నారు. హిందూ జీవన దృష్టి అంటే అందరినీ సమానంగా చూసే దృష్టి అన్నారు. ప్రపంచ గందర గోళానికి సమాధానం మన ఆధ్యాత్మికం ద్వారా దొరుకుతుందన్నారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ బీజేపీకి కమలం గుర్తు పెట్టారని, కమలం బురదలో నుంచి వికసిస్తుందని, కమలానికి బురద అంటదన్నారు. కమలం పువ్వులోని రేకలు ప్రజాస్వామ్యం, సమానత్వం, సర్వధర్మ భావన, విలువలతో కూడిన రాజకీయం, జాతి జాతీయత వంటి పంచ నిష్టలతో ఏర్పడిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సబ్‌ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ అనే నినాదంతో పరిపాలన సాగిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు పాటించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్బూరి శ్రీరామ్‌, దక్షిణాది రాష్ట్రాల ప్రశిక్షణ కమిటీ కన్వీనర్‌ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు ఉప్పాలపాటి శ్రీనివాసరావు, నాగలక్ష్మి, సయ్యద్‌ బాషా, మువ్వల సుబ్బయ్య, గణేష్‌, జిల్లా నాయకులు కల్లూరి శ్రీవాణి, అన్నెపాక ప్రపుల్ల శ్రీకాంత్‌, స్థానిక నాయకులు నరసింహారావు, స్వామి, తునికిపాటి రామాచారి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement