తప్పుడు మార్గాలను విడనాడండి డ్రగ్స్‌కు దూరంగా ఉండండి యువతకు సీపీ రాజశేఖరబాబు సూచన
లబ్బీపేట(విజయవాడతూర్పు): డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని నగర పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు యువతకు సూచించారు. తప్పుడు మార్గాలు ఎంచుకోవడం సులభమే కావచ్చునని, కానీ వాటి వలన కలిగే నష్టం ఒక వ్యక్తితో ఆగిపోదని, అది కుటుంబాలను, సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తుందన్నారు. విజయవాడ నార్త్ డివిజన్ పరిధిలో డ్రగ్స్‌పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన తనిఖీలలో పాజిటివ్ వచ్చిన యువకులకు అలవాటు మానుకుని మంచి మార్గంలో నడిచే విధంగా మార్పుకు మరో అవకాశం అనే నినాదంతో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ స్వయంగా కౌన్సెలింగ్ కు వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడారు. వారికి ఉన్న సోషల్ మీడియా అకౌంట్ల గురించి, వారి చేతులపై ఉన్న పచ్చబొట్లు, కోతలు, వివిధ అంశాలను గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ నేటి యువత తెలిసీ తెలియక తప్పుడు అలవాట్లకు, డ్రగ్స్ (గంజాయి) వంటి వ్యసనాలకు బానిసలై తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారన్నారు. నగరంలో శాంతిభద్రతలను కాపాడటమే కాకుండా, బాధ్యత గల పౌరులను తయారుచేయాలనే సత్సంకల్పంతో మహాన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జీరో టాలరెన్స్ టు డ్రగ్స్ అనే నినాదంతో యువతను, సమాజాన్ని మత్తు పదార్ధాల నుంచి పూర్తిగా దూరం చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, ఏడీసీపీ జి.రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


